Ravindra Jadeja Becomes Fifth Player in IPL History to Claim 100 Catches: ఐపీఎల్‌(IPL)లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌(KKR)కు చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK)చెక్‌ పెట్టింది. మొదట బంతితో కోల్‌కత్తాను తక్కువ పరుగులకే కట్టడి చేసిన చెన్నై... ఆ తర్వాత స్పల్ప లక్ష్యాన్ని సునాయంసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కత్తా...  చెన్నై బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమైంది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో మరో 14 బంతులు మిగిలి ఉండగానే మూడే వికెట్లు కోల్పోయి చెన్నై లక్ష్యాన్ని ఛేదించింది.
 
జడ్డూ అరుదైన రికార్డు
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఐపీఎల్‌లో వంద క్యాచ్‌లు అందుకున్న అయిదో క్రికెటర్‌గా నిలిచాడు. చెపాక్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు పట్టిన జడ్డూ.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన జాబితాలో బెంగళూరు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ ఇప్పటివరకూ 110 క్యాచులు పట్టగా... సురేశ్‌ రైనా 109 క్యాచులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. తర్వాత రోహిత్ శర్మ 100, రవీంద్ర జడేజా 100, శిఖర్ ధావన్ 98  తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. 
 
చెన్నై గెలిచిందిలా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్తా ఇన్నింగ్స్‌ తొలి బంతికే దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. తొలి ఓవర్‌ తొలి బంతికే కోల్‌కత్తా బ్యాటర్‌ ఫిల్‌ సాల్ట్‌ను తుషార్‌ దేశ్‌పాండే అవుట్‌ చేసి కోల్‌కత్తాకు షాక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత సునీల్ నరైన్‌, రఘువంశీ తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించారు. ఆరు ఓవర్లలోనే 56 పరుగులు జోడించడంతో కోల్‌కత్తా కోలుకున్నట్లే కనిపించింది. కానీ ఆ తర్వాత వికెట్ల పతనం ఆరంభమైంది. సునీల్‌ నరైన్‌ 20 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 27 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. 18 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సుతో 24 పరుగులు చేసిన రఘువంశీని కూడా జడేజానే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 56 పరుగుల వద్ద రఘువంశీ అవుటవ్వగా... 60 పరుగుల వద్ద సునీల్‌ నరైన్‌ పెవిలియన్‌ చేరాడు. స్వల్ప వ్యవధిలో క్రీజులో కుదురుకున్న వీరిద్దరూ అవుట్‌ కావడంతో కోల్‌కత్తా కష్టాల్లో పడింది. శ్రేయస్స్ అయ్యర్‌ 32 బంతుల్లో 34 పరుగులు చేసి అవుటయ్యాడు. వెంకటేష్‌ అయ్యర్‌ 3, రణదీప్‌ సింగ్‌ 13, రింకూసింగ్‌ 9, అండ్రూ రసెన్‌ పది పరుగులు చేసి అవుటయ్యారు.  కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు తీయగా... ముస్తాఫిజుర్‌ రెండు వికెట్లు తీశాడు. 
 
సునాయసంగా లక్ష్య ఛేదన
138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకు పర్వాలేదనిపించే ఆరంభం దక్కింది. రుతురాజ్‌-రచిన్‌ తొలి వికెట్‌కు 26 పరుగులు జోడించారు. తర్వాత రుతురాజ్‌ గైక్వాడ్‌.. డేరిల్‌ మిచెల్‌.. చెన్నైను విజయం దిశగా నడిపించారు. రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 58 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులతో అజేయంగా నిలిచి చెన్నైకు సునాయస విజయాన్ని అందించాడు. శివమ్‌ దూబే 18 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సులతో 28 పరుగులు చేశాడు. దీంతో మరో 14 బంతులు మిగిలి ఉండగానే మూడే వికెట్లు కోల్పోయి చెన్నై లక్ష్యాన్ని ఛేదించింది.