Manish Pandey slams blistering ton: ఇండియన్ ప్రీమియర్ లీగులో (IPL 2022) కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌కు (Lucknow Super Gaints) అన్నీ శుభ శకునాలే కనిపిస్తున్నాయి! మెంటార్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) వ్యూహాలు అద్భుతంగా అనిపిస్తున్నాయి. కర్ణాటక కెప్టెన్ మనీశ్ పాండేపై (Manish Pandey) అతడుంచిన నమ్మకం నిజమైంది. రంజీ ట్రోఫీలో పాండే దుమ్మురేపాడు. 83 బంతుల్లోనే శతకం బాదేశాడు.
మనీశ్ పాండే విధ్వంసం
రైల్వేస్‌తో జరిగిన రంజీ మ్యాచులో మెరుగైన స్థితిలో నిలిచింది. తొలి రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (16), దేవదత్ పడిక్కల్ (21) విఫలమైన వేళ కెప్టెన్ మనీశ్ పాండే (156; 121 బంతుల్లో 12x4, 10x6), కేవీ సిద్ధార్థ్ (140*; 221 బంతుల్లో 17x4, 2x6) సెంచరీలు కొట్టేశారు. ముఖ్యంగా మనీశ్ ఆటకు అంతా ఫిదా అయ్యారు. ఎన్నాళ్ల నుంచో దాగున్న కసిని బయట పెట్టినట్టుగా అనిపించింది. ఆకలిగొన్న పులిలా అతడు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 83 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. ఇందుకు 6 సిక్సర్లు, 9 బౌండరీలు బాదేశాడు. ఆ తర్వాత మరింతగా విరుచుకుపడ్డాడు. భారీ షాట్లు బాదేశాడు.
వారి బౌలింగ్‌లో ఊచకోత
మనీశ్ పాండే 121 బంతులు ఆడితే అందులో 56 డాట్‌బాల్స్ ఉన్నాయి. అతడి 156 పరుగుల్లో దాదాపుగా 70 శాతం బౌండరీల ద్వారానే వచ్చాయి. 38 సింగిల్స్ తీశాడు. అవినాశ్ యాదవ్, అమిత్ మిశ్రా బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అవినాశ్ బౌలింగ్‌లో 36 బంతుల్లోనే 2 బౌండరీలు, 6 సిక్సర్లు దంచి 56 పరుగులు చేశాడు. మిశ్రా బౌలింగ్‌లో 23 బంతులాడి 5 బౌండరీలు, ౩ సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. పాండే దంచికొట్టడంతో లక్నో హ్యాపీ హ్యాపీగా కనిపించింది. వెంటనే అతడిని అభినందిస్తూ ట్వీట్ చేసింది.
సన్‌రైజర్స్ ఉసూరు
ఐపీఎల్‌లో మనీశ్ పాండే గతేడాది సన్‌రైజర్స్‌కు ఆడాడు. నిజానికి అతడికి చాలినన్ని అవకాశాలు ఇవ్వలేదు. విఫలమైనప్పుడు నమ్మకం ఉంచలేదు. వేలంలో అతడి కోసం సన్‌రైజర్స్ ఎక్కువగా ప్రయత్నించలేదు. నామమాత్రంగా బిడ్డింగ్ వేసింది. కానీ గౌతమ్ గంభీర్ అతడిపై నమ్మకం ఉంచాడు. రూ.4.60 కోట్లకు తీసుకున్నాడు. టెక్నిక్ పరంగా పాండేకు తిరుగులేదు. అతడు స్థాయికి తగినట్టు ఆడితే ప్రత్యర్థి తట్టుకోలేడు. గంభీర్ సారథ్యంలోనే కోల్‌కతాకు అతడు విపరీతంగా పరుగులు చేశాడు. రంజీలో అదరగొట్టడంతో సన్‌రైజర్స్ అభిమానులు ఉసూరుమంటున్నారు.