IPL 2025 RR VS GT Updates: ప‌రాజ‌య భారంతో ఉన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు కెప్టెన్ సంజూ శాంసన్ పై బీసీసీఐ కొర‌ఢా ఝ‌ళిపించింది. బుధ‌వారం గుజ‌రాత్ టైటాన్స్ తో మ్యాచ్ సంద‌ర్బంగా స్లో ఓవ‌ర్ రేట్ కు పాల్ప‌డినందుకుగాను అత‌నికి రూ.24 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. ఈ సీజ‌న్ లో ఇలాంటి త‌ప్పిదానికి పాల్ప‌డ‌టంతో రాయ‌ల్స్ కు ఇది రెండోసారి కావ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో రియాన్ ప‌రాగ్ కెప్టెన్సీలో చెన్నై సూప‌ర్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో స్లో ఓవ‌ర్ రేట్ కు పాల్ప‌డినందుకుగాను రాయ‌ల్స్ పై ఐపీఎల్ యాజ‌మాన్యం క‌న్నెర్ర చేసింది. తాజాగా రెండోసారి కూడా ఇలాంటి పొర‌పాటు చేయ‌డంతో ప్లేయింగ్ లెవ‌న్ లోని ఆట‌గాళ్ల మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా రూ.6 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ కు కూడా ఇది వ‌ర్తిస్తుంద‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. గుజరాత్ పై త‌మ ప్ర‌ణాళిక‌లు ఫ‌లించ‌లేద‌ని సంజూ పేర్కొన్నాడు. 

అక్క‌డ విఫ‌ల‌మ‌య్యాం..గుజ‌రాత్ తో ఆరంభంలోనే త‌మ బౌల‌ర్లు ప్ర‌ణాళిక‌లకు త‌గిన‌ట్లుగా బౌలింగ్ చేశార‌ని, ముఖ్యంగా గుజ‌రాత్ కెప్టెన్ శుభ‌మాన్ గిల్ ను మంచి ప్లాన్ తో జోఫ్రా ఆర్ఛ‌ర్ ఔట్ చేసిన‌ట్లు సంజూ తెలిపాడు. ఆ త‌ర్వాత బౌల‌ర్లు ఎక్కువ‌గా ప‌ర‌గులు స‌మ‌ర్పించుకోవ‌డం, అనుకున్న దానికంటే 15-20 ప‌రుగులు ఎక్కువ‌గా ఇచ్చార‌ని పేర్కొన్నాడు. అలాగే బ్యాటింగ్ లో కీల‌క‌ద‌శ‌లో వికెట్లు కోల్పోవ‌డం కొంప‌ముంచింద‌ని తెలిపాడు. ముందుగా త‌న‌తో మంచి భాగ‌స్వామ్యం నెల‌కొల్పిన ప‌రాగ్ కీల‌క‌ద‌శ‌లో ఔట‌య్యాడ‌ని, ఆ త‌ర్వాత షిమ్రాన్ హిట్ మెయ‌ర్ బౌండ‌రీలు బాదుతూ, ట‌చ్ లో ఉన్న‌ప్పుడు, అన‌వ‌స‌రంగా తాను ఔట‌యిన‌ట్లు విచారం వ్య‌క్తం చేశాడు. ఇక ఈ సీజ‌న్ లో ఫ‌స్ట్ బ్యాటింగ్ చేస్తున్న‌ప్పుడు మాత్ర‌మే రాయ‌ల్స్ గెలుపొందింది. ఛేజింగ్ లో రెండుసార్లు విఫ‌ల‌మైంది. దీంతో ప్ర‌స్తుతం రెండు విజ‌యాల‌తో ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో ఉంది. 

గుజ‌రాత్ స‌మష్టి విజ‌యం.. మాజీ చాంపియ‌న్స్ గుజ‌రాత్ టైటాన్స్ స‌త్తా చాటుతోంది. నాలుగో విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ ప్లేసును ద‌క్కించుకుంది. బుధ‌వారం జ‌రిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయ‌ల్స్ పై 58 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల‌కు 217 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ (82)తో ఆక‌ట్టుకున్నాడు. బౌల‌ర్లలో తుషార్ దేశ్ పాండే, మ‌హీశా తీక్ష‌ణకు రెండేసి వికెట్లు ద‌క్కాయి. ఛేద‌న‌లో రాయ‌ల్స్ 19.2 ఓవ‌ర్ల‌లో 159 ప‌రుగుల‌కు ఆలౌటైంది. షిమ్రాన్ హిట్ మెయ‌ర్ (52) అద్భుత‌మైన ఫిఫ్టీతో ఒంట‌రి పోరాటం చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. బౌల‌ర్లలో ప్రసిధ్ కృష్ణ‌కు మూడు వికెట్లు ద‌క్కాయి.