GT In Top Place at IPL 2025: మాజీ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ సత్తా చాటుతోంది. నాలుగో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసును దక్కించుకుంది. బుధవారం సొంతగడ్డ అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 58 పరుగులతో విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 217 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ స్టన్నింగ్ ఫిఫ్టీ (53 బంతుల్లో 82, 8 ఫోర్లు, 3 సిక్సర్లు)తో తన ఫామ్ ను చాటుకున్నాడు. బౌలర్లలో తుషార్ దేశ్ పాండే, మహీశా తీక్షణకు రెండేసి వికెట్లు దక్కాయి. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాయల్స్ కు బ్యాటింగ్ వైఫల్యం కొంపముంచింది. 19.2 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ బ్యాటర్ షిమ్రాన్ హిట్ మెయర్ (32 బంతుల్లో 52, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన ఫిఫ్టీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.బౌలర్లో ప్రసిధ్ కృష్ణకు మూడు వికెట్లు దక్కాయి. తాజా విజయంతో ఎనిమిది పాయింట్లతో గుజరాత్ టాప్ ప్లేస్ ను దక్కించుకుంది.
సూపర్ ఫామ్ లో సుదర్శన్.. ఈ మ్యాచ్ లో సుదర్శన్ వన్ మేన్ షో చూపించాడు. మిగతా బ్యాటర్లంతా ఓ మోస్తరుగా ఆడిన పిచ్ పై తను సూపర్ టచ్ లో కనిపించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సుదర్శన్.. వేగంగా పరుగులు సాధించాడు. మరో ఎండ్ లో కెప్టెన్ శుభమాన్ గిల్ (2) విఫలమైనా, జోస్ బట్లర్ (36), షారూఖ్ ఖాన్ (36)లతో కలిసి జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరితో వేగంగా పరుగులు జత చేస్తూ, జట్టు భారీ స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈక్రమంలో 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుని, వడివడిగా సెంచరీ వైపు దూసుకెళ్లాడు. చివర్లో స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో ఔటయ్యాడు. ఆఖర్లో రాహుల్ తెవాతియా (24 నాటౌట్), రషీద్ ఖాన్ (12) వేగంగా ఆడటంతో జట్టు 210+ పరుగుల మార్కును దాటింది.
ఏ దశలోనూ.. భారీ టార్గెట్ ను రాయల్స్ ఏ దశలోనూ ఛేజ్ చేస్తుందని అనిపించలేదు. ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ (6), నితీశ్ రాణా (1) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ సంజూ శాంసన్ (41), రియాన్ పరాగ్ (26) తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా, ఫలించలేదు. వీరిద్దరూ కలిసి 48 పరుగులు జోడించి ఫర్వాలేదనిపించారు. అయితే బ్యాట్ ఝళిపించే టైంలో పరాగ్ ఔటయ్యాడు. ధ్రువ్ జురెల్ (5) విఫలం కావడంతో టీమ్ వెనుకంజ వేసింది. ఈ దశలో హిట్ మెయర్ తో కలిసి సంజూ గెలిపించే ప్రయత్నం చేసినా, కెప్టెన్ ను ఔట్ చేసి ప్రసిధ్ షాకిచ్చాడు. ఆ తర్వాత హిట్ మెయర్ పోరాడినా, ఛేదించాల్సిన టార్గెట్ చాలా ఉండటంతో రాయల్స్ కు ఓటమి తప్పలేదు. 29 బంతుల్లో ఫిఫ్టీ చేసిన తర్వాత హిట్ మెయర్ వెనుదిరగడం, లోయర్ ఆర్డర్ చేతులెత్తేయడంతో రాయల్స్ పరాజయం పరిపూర్ణమైంది. భారీ ఫిఫ్టీ చేసిన సుదర్శన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మిగతా బౌలర్లలో రషీద్ ఖాన్, సాయి కిశోర్ కు తలో రెండు వికెట్లు దక్కాయి.