Raghu Sharma Emotional Celebration and LSG vs MI Match: ఐపీఎల్ (IPL 2026)లో సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఒక అరుదైన దృశ్యానికి వేదికైంది. ముంబై ఇండియన్స్ తరపున డెబ్యూ చేసిన స్పిన్నర్ రఘు శర్మ తన మొదటి వికెట్‌ను వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను లక్నో బ్యాటర్ అక్షత్ రఘువంశీని అవుట్ చేసి తన కెరీర్‌లో ఫస్ట్ ఐపీఎల్ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. వికెట్ తీసిన వెంటనే రఘు తన జేబులోంచి ఒక చిన్న కాగితం తీసి స్టాండ్స్ వైపు చూపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
నోట్‌లో ఏముందంటే?రఘు శర్మ చూపించిన ఆ నోట్ మీద ఎంతో ఎమోషనల్ మెసేజ్ ఉంది. "రాధే రాధే.. గురుదేవుల దైవ కృప వల్ల నా 15 ఏళ్ల సుదీర్ఘమైన బాధాకరమైన నిరీక్షణ ఈరోజుతో ముగిసింది. నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్ (బ్లూ అండ్ గోల్డ్) టీమ్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. జై శ్రీరామ్" అని అందులో రాసి ఉంది. లక్నో ఇన్నింగ్స్ 13వ ఓవర్ లో రఘు తన బౌలింగ్ లోనే రిటర్న్ క్యాచ్ పట్టి అక్షత్ ను అవుట్ చేశాడు. ఈ మూమేంట్ కోసం అతను దాదాపు 15 ఏళ్లుగా కష్టపడుతున్నట్లు ఆ నోట్ ద్వారా స్పష్టమైంది. ముంబై ఫ్రాంచైజీ తనపై నమ్మకం ఉంచి ఛాన్స్ ఇవ్వడం పట్ల అతను చాలా ఎమోషనల్ అయ్యాడు. రఘు శర్మ సెలబ్రేషన్ చూస్తుంటే ఐపీఎల్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు, ఎంతోమంది కల అని అర్థమవుతోంది. 15 ఏళ్ల తర్వాత అతను సాధించిన ఈ విజయం యువ క్రికెటర్లకు ఒక ఇన్సిపిరేషన్ అని చెప్పొచ్చు.
పూరన్ విధ్వంసం - లక్నో భారీ స్కోరు..మరోవైపు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్ లో బ్యాట్‌తో చెలరేగింది. రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. వెస్టిండీస్ పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ ఈ సీజన్ లో తన మొదటి హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. కేవలం 21 బంతుల్లోనే 63 పరుగులు చేసి ముంబై బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఓపెనర్ మిచెల్ మార్ష్ కూడా 44 పరుగులతో రాణించి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. లక్నో టీమ్ కి ఇది తొమ్మిదో మ్యాచ్ కాగా, ఈసారి బ్యాటర్లు పక్కా ప్లాన్ తో గ్రౌండ్ లోకి దిగినట్లు కనిపించింది.
కెప్టెన్ పంత్ కష్టాలు..లక్నో టీమ్ భారీ స్కోరు చేసినప్పటికీ కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్ లో పంత్ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ సీజన్ లో అతను నిలకడగా రాణించలేకపోతున్నాడు. అయితే చివర్లో ఐడెన్ మార్క్రమ్ (31 నాటౌట్), హిమ్మత్ సింగ్ (40 నాటౌట్) ధాటిగా ఆడటంతో లక్నో స్కోరు 200 దాటింది. ముంబై బౌలర్లలో రఘు శర్మ తన 4 ఓవర్ల కోటాను పూర్తి చేసి ఒక వికెట్ తీశాడు. లక్నో టీమ్ కి కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలవడం వాళ్లకు చాలా ముఖ్యం.
