Mumbai Indians Managed to Break a Major Record: చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ లో విఫలమైనా, ముంబై ఇండియన్స్ ఒక అరుదైన ఘనత సాధించింది. టీ20 క్రికెట్ చరిత్రలో 50,000 పరుగుల మైలురాయిని దాటిన ప్రపంచంలోనే తొలి జట్టుగా ముంబై రికార్డు సృష్టించింది. తమ 286వ మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకుంది. ఈ జాబితాలో ఇంగ్లీష్ కౌంటీ జట్టు సోమర్‌సెట్ (48,244 పరుగులు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (47,304 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్‌లో ముంబై తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.

Continues below advertisement

 ఫ్యామిలీ సపోర్ట్..బ్యాటింగ్ లో తన ఫామ్ గురించి చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో ఒక్కోసారి మనం కొట్టిన మంచి షాట్లు కూడా నేరుగా ఫీల్డర్ చేతికి వెళ్తుంటాయని, కానీ త‌న భార్య, జట్టు సభ్యులు, మేనేజ్మెంట్ త‌నపై నమ్మకం ఉంచారని అన్నాడు. ఒక్కసారి మంచి ఆరంభం లభిస్తే మ్యాచ్ చివరి వరకు ఉండి గెలిపించాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. మరోవైపు యువ ఆటగాడు కార్తీక్ శర్మ ఇన్నింగ్స్ పై కూడా కెప్టెన్ ప్రశంసలు కురిపించాడు. కార్తీక్ అనవసరపు షాట్లు ఆడకుండా, బౌలర్లను ఎంచుకుని వివేకంతో బ్యాటింగ్ చేస్తాడని, నంబర్ 4లో అతను జట్టుకు మంచి బ్యాలెన్స్ ఇస్తున్నాడని చెప్పాడు.

హార్దిక్ పాండ్యా ఆవేదన..వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన నిరాశను దాచుకోలేకపోయాడు. ఈ రోజు త‌మది కాదు అని చెప్పడం కంటే, ఈ సీజన్ త‌మది కాదు అనిపిస్తోందని, చెన్నై జట్టు అన్ని విభాగాల్లోనూ త‌మకంటే మెరుగ్గా రాణించిందని అంగీక‌రించాడు. ఒక దశలో తాము 180 నుండి 190 పరుగులు చేస్తామనుకున్నామ‌ని, కానీ 10 ఓవర్ల తర్వాత త‌మకు మొమెంటం లభించలేదన్నాడు. ఫినిషింగ్ కూడా ఆశించిన స్థాయిలో లేదని అంగీకరించాడు. చెన్నై బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేశారని, తమ బ్యాటర్లు వారిని ఎదుర్కోవడంలో విఫలమయ్యారని పాండ్యా చెప్పుకొచ్చాడు.

గెలుపు సంబరాలు..చివరి వరకు ఉండి మ్యాచ్ ముగించిన కార్తీక్ శర్మ మాట్లాడుతూ, గెలిచిన తర్వాత తను చేసిన సెలబ్రేషన్స్ ముందుగానే ప్లాన్ చేసుకున్నవని చెప్పాడు. పిచ్ స్లోగా ఉన్నప్పటికీ కెప్టెన్ ఇచ్చిన ధైర్యంతో తన సహజ సిద్ధమైన ఆట ఆడానని తెలిపాడు. ఈ విజయంతో చెన్నై క్యాంప్ లో పండుగ వాతావరణం నెలకొంది. వచ్చే మ్యాచుల్లో కూడా ఇదే జోరును కొనసాగించి అభిమానుల కోసం శ్రమిస్తామని గైక్వాడ్ ధీమా వ్యక్తం చేశాడు.  ఇక తాజా ప‌రాజ‌యంతో టోర్నీ ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు ముంబైకి దాదాపుగా ముగిసిన‌ట్లే. టోర్నీలో ఏడో పరాజ‌యం సాధించిన తొలి జ‌ట్టుగా నిలిచిన ముంబై.. మిగ‌తా ఐదు మ్యాచ్ లు గెలిచి, ఇత‌ర స‌మీక‌ర‌ణాలు క‌లిసొస్తే తప్ప ముంద‌డ‌గు వేయడం క‌ష్టం.