Rachakonda Cp Key Instructions: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో (Uppal Stadium) బుధవారం రాత్రి ముంబయి ఇండియన్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో స్డేడియంను రాచకొండ సీపీ తరుణ్ జోషి (Tarun Joshi) మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మ్యాచ్ కు వచ్చే ప్రేక్షకులకు కీలక సూచనలు చేశారు. ల్యాప్ ట్యాప్స్, వాటర్ బాటిల్స్, సిగరెట్స్, లైటర్స్, బైనాక్యులర్స్ ను నిషేధించామని.. వాటిని స్టేడియం లోపలికి తీసుకు రావొద్దని స్పష్టం చేశారు. మ్యాచ్ కు వచ్చేటప్పుడు ఎలాంటి వస్తువులను అనుమతించమని చెప్పారు. అయితే, బ్లూటూత్స్ అనుమతిస్తామని.. స్టేడియం పరిసరాల్లో షీ టీమ్స్ నిఘా ఉంటుందని వెల్లడించారు. మ్యాచ్ కు 3 గంటల ముందు నుంచి ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తామని అన్నారు. 


భారీ భద్రత


ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కోసం 2,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ వివరించారు. 'స్టేడియం వద్ద 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 39 వేల సీటింగ్ సామర్థ్యం ఉండగా.. స్టేడియం లోపల, బయట భారీగా పోలీసులను మోహరిస్తున్నాం. ఉప్పల్ స్టేడియం పరసర ప్రాంతాల్లోని రామాంతపూర్, హబ్సిగూడ, ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ కలుగకుండా చర్యలు చేపట్టాం. మెడికల్ టీమ్స్, 4 అంబులెన్సులు, ఫైరింజన్లను సిద్ధంగా ఉంచుతాం. మ్యాచ్ టికెట్ కొనుగోలు చేసిన వారికి పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నాం. స్టేడియం వద్ద బ్లాక్ టికెట్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం.' అని సీపీ హెచ్చరించారు.


మ్యాచ్ కు ప్రత్యేక బస్సులు


మరోవైపు, బుధవారం నాటి ఐపీఎల్‌ మ్యాచ్‌కు భారీగా ప్ర‌త్యేక బ‌స్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. అభిమానుల సౌకర్యార్థం జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌ మైదానానికి 60 ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డపనున్నట్లు చెప్పారు. ఇవి బుధవారం సాయంత్రం 6 గంటలకు నిర్దేశిత ప్రాంతాల్లో ప్రారంభమై.. మ్యాచ్‌ అనంతరం తిరిగి రాత్రి 11.30 గంటలకు స్టేడియం నుంచి బయల్దేరుతాయని పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని క్రికెట్‌ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.






ఘట్‌కేసర్, ఎన్జీవోస్ కాలనీ, జీడిమెట్ల, జేబీఎస్, ఛార్మినార్ నుంచి ఉప్పల్ స్టేడియానికి 4 బస్సులు నడుపుతామని ఆర్టీసీ వెల్లడించింది. ఇక హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, మిథాని ల్యాబ్ క్వార్టర్స్, కోఠి, అఫ్జల్‌గంజ్, లక్డీకపూల్, దిల్‌సుఖ్ నగర్, కేపీహెచ్‌బీ, మేడ్చల్, మియాపూర్, హకీంపేట్, ఈసీఎల్ క్రాస్ రోడ్స్, బోయిన్ పల్లి, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, కొండాపూర్, బీహెచ్ఈఎల్, ఎల్బీనగర్ నుంచి 2 చొప్పున బస్సులను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి నడుపుతామని పేర్కొంది. ఇవి కాకుండా ఉప్పల్ స్టేడియం నుంచి ఉప్పల్ డిపోకు చెందిన 4 బస్సులు మెహిదీపట్నానికి నడుస్తాయి.


Also Read: CM Revanth Reddy: 'లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ 100 రోజుల పాలనకు రెఫరెండం' - అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు