Punjab 2nd win in Ipl 2025: పంజాబ్ కింగ్స్ జోరు మీదుంది. టోర్నీలో వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని ద‌క్కించుకుని స‌త్తా చాటుతోంది. సోమ‌వారం ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పై 8 వికెట్ల‌తో విజ‌యం సాధించింది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల‌కు 171 ప‌రుగులు చేసింది. నికోల‌స్ పూరన్ (30 బంతుల్లో 44, 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ తో త‌న ఆరెంజ్ క్యాప్ హోల్డ‌ర్ గా నిలిచాడు. పేసర్ అర్ష‌దీప్ సింగ్ మూడు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. ఇక ఛేద‌న‌ను సునాయాసంగా పంజాబ్ పూర్తి చేసింది. కేవ‌లం 16.2 ఓవ‌ర్లలో రెండు వికెట్ల‌కు 177 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ ప్ర‌భు సిమ్రాన్ సింగ్ ప్ర‌తాపం (34 బంతుల్లో 69, 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) చూపెట్ట‌డంతో పంజాబ్ ఈజీ విక్ట‌రీ సొంతం చేసుకుంది. దిగ్వేశ్ రాఠీకి రెండు వికెట్లు ద‌క్కాయి. ఈ విజ‌యంతో పంజాబ్ టాప్-2 ప్లేస్ కి చేరుకుంది.  

వికెట్లు టపటపా..ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నోకు ఏదీ క‌లిసి రాలేదు. సూప‌ర్ ఫామ్ లో ఉన్న మిషెల్ మార్ష్ డ‌కౌటయ్యాడు. అయితే ఐడెన్ మార్క్ర‌మ్ (28) ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. ఇక పూర‌న్ మ‌రోసారి త‌న విలువ‌ను చాటాడు. టాప్ స్కోర‌ర్ గా నిలిచి, జ‌ట్టుకు స‌వాలు విస‌ర‌గ‌లిగే స్కోరును అందించ‌గలిగాడు. ఇక మ‌ధ్య‌లో ఆయుష్ బ‌దోనీ (41) మూడు సిక్స‌ర్ల‌తో కాస్త వేగంగా ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. చివ‌ర్లో అబ్దుల్ స‌మ‌ద్ (27) ఫినిషింగ్ ట‌చ్ ఇవ్వ‌డంతో ల‌క్నో 170 ప‌రుగుల మార్కును దాటింది. మిగ‌తా బౌల‌ర్ల‌లో మార్కోయ‌న్సెన్ పొదుపుగా బౌలింగ్ చేసి, ఒక వికెట్ తీశాడు. 

శ్రేయ‌స్ హ‌వా..ఛేజింగ్ లో పంజాబ్ కు శుభారంభం ద‌క్కక పోయినా, ప్ర‌భుసిమ్రాన్ మెరుపుల‌తో అలరించాడు. ఆరంభంలో క‌ళ్లు చెదిరే క‌వ‌ర్ డ్రైవ్ ట‌చ్ లోకి వ‌చ్చిన ప్ర‌భ్.. ఆ త‌ర్వాత ఔట‌య్యేంత వ‌ర‌కు దూకుడుగా ఆడాడు. ఈ క్ర‌మంలో 23 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో మ‌రింత వేగంగా ఆడే క్ర‌మంలో ప్ర‌భ్ ఔట‌య్యాడు. ఇక ఛేజింగ్ లో ఐదుసార్లు నాటౌట్ గా నిలిచి, మ్యాచ్ ల‌ను పూర్తి చేస్తాడనే పేరున్న శ్రేయస్ అయ్య‌ర్ (30 బంతుల్లో 52, 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) ఆ పేరును నిల‌బెట్టుకున్నాడు. మ‌రోసారి స్ట‌న్నింగ్ ఫిఫ్టీతో అజేయంగా నిలిచి జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాడు. ముందుగా ప్ర‌భ్ తో 84 ప‌రుగులు జోడించిన శ్రేయ‌స్.. ఆ త‌ర్వాత నేహాల్ వ‌ధేరా (25 బంతుల్లో 43 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) తో క‌లిసి అజేయంగా 67 ప‌రుగులు జోడించారు. ప్ర‌భు ఉన్నంత వ‌ర‌కు దూకుడుగా ఆడాడు. అత‌ను వెనుదిరిగిన త‌ర్వాత శ్రేయ‌స్, వధేరా పోటీ ప‌డి ప‌రుగులు సాధించ‌డంతో పంజాబ్ ఈజీ విక్టరీ సాధించింది. దీంతో మ‌రో 22 ప‌రుగులు మిగిలి ఉండ‌గానే, పంజాబ్ గెలుపు తీరాల‌కు చేరింది. ఇన్నింగ్స్ చివరి బంతికి భారీ సిక్సర్ తో శ్రేయస్ ఫిఫ్టీ సాధించడం విశేషం.  ప్ర‌భు సిమ్రాన్ సింగ్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది.