Jadeja Vs Dhoni: ఐదుసార్లు చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ ఈ సీజ‌న్ లో కాస్త స్ట్ర‌గుల్ అవుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన మూడు మ్యాచ్ ల్లో కేవ‌లం ఒక్క మ్యాచ్ లో మాత్ర‌మే గెలిచింది. ఇక చివ‌రి రెండు మ్యాచ్ ల్లో ప‌రాజయం పాలైంది. ముఖ్యంగా వెట‌ర‌న్లు ఎంఎస్ ధోనీ, ర‌వీంద్ర జ‌డేజాపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు మ్యాచ్ ల్లో గెలిచే ఇంటెంట్ లేకుండా ఆడార‌ని విమ‌ర్శిస్తున్నారు. ముఖ్యంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు రావ‌డంపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ర‌వీంద్ర జ‌డేజా ఈ విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం అన్న‌ట్లుగా ఒక పోస్టును షేర్ చేశాడు. తాజాగా ఈ పోస్టు నిమిషాల్లో సోష‌ల్ మీడియాలో వైర‌లైంది. క్రికెట్ అభిమానులు త‌మ‌కు తోచిన కామెంట్లు పెడుతూ, లైకులు, షేర్లు చేస్తూ వైర‌ల్ చేశారు. ఇంత‌కీ ఆ పోస్టులో ఏముందంటే.. ప్ర‌స్తుత‌మున్న గ‌డ్డు కాలం తొలిగిపోతుంద‌నే ఆశాభావ దృక్ఫ‌థంతో పోస్టు చేశాడు. 

బ్యాటింగ్ లో విఫ‌లం.. ఈ సీజ‌న్ లో బ్యాటింగ్ ఆర్డ‌ర్ లో విఫ‌లం కావ‌డం చెన్నైని దెబ్బ‌తీస్తోంది. ముఖ్యంగా ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర‌, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ల‌పై ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతోంది. వాళ్లిద్ద‌రూ ఆడితేనే ప్ర‌భావవంతంగా క‌న‌బడుతోంది. ఇక బ్యాటింగ్ లైన‌ప్ లో మార్పులు చేర్పులు ఆ జ‌ట్టుకు శాపంగా మారాయి. ముఖ్యంగా రాహుల్ త్రిపాఠిని ఓపెన‌ర్ గా దించ‌డం, కివీస్ ఓపెన‌ర్ డేవ‌న్ కాన్వేను బెంచ్ కే ప‌రిమితం చేయ‌డం.. మిడిలార్డ‌ర్ విఫ‌లం కావ‌డం, అయినా కూడా ఆట‌గాళ్ల‌ను మార్చ‌క‌పోవ‌డం త‌దిత‌రాలు చెన్నైకి శాప‌మ‌య్యాయని విశ్లేషకులు పేర్కొంటున్నాయి.  

మార్పులు చేయాలి.. బ్యాటింగ్ ఆర్డ‌ర్ లో మార్పులు చేస్తేనే చెన్నై రాణించ‌గ‌లుగుతుంద‌ని భార‌త క్రికెట‌ర్ చ‌టేశ్వ‌ర్ పుజారా వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా ఓపెన‌ర్ గా త్రిపాఠిని ఆడించ‌డం స‌రికాద‌ని, అత‌ని స్థానంలో కాన్వేను దించాల‌ని సూచించాడు. అలాగే ఓవ‌ర్సీస్ ఆట‌గాళ్ల ఎంపిక‌లో మ‌రింత తెలివిగా వ్య‌వ‌హ‌రించాల‌ని పేర్కొన్నాడు. టీమ్ మేనేజ్మెంట్ వీలైనంత త్వ‌ర‌గా కుదురైన బ్యాటింగ్ లైనప్ ముందుకు రావాల‌ని పేర్కొన్నాడు. మిడిలార్డ‌ర్లోని శివ‌మ్ దూబే, దీప‌క్ హూడా, శామ్ క‌ర‌న్ స్థాయికి త‌గ్గ‌ట్లు రాణించాల‌ని సూచించాడు. అప్పుడే జ‌ట్టు ఎక్కువ‌గా విజ‌యాలు సాధిస్తుంద‌ని పేర్కొన్నాడు. ఇక చెన్నై టీమ్ ఆట కూడా సాధార‌ణంగా ఉంద‌ని, 160-170 ప‌రుగులను ఛేజ్ చేస్తోంద‌ని, 170 ప‌రుగుల టార్గెట్ ను డిఫెండ్ చేసుకుంటోంద‌ని గుర్తు చేశాడు. అయితే మిగ‌తా జ‌ట్లు దూకుడే మంత్రంగా ఆడుతున్న నేప‌థ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట‌ర్లు కూడా ఆట‌తీరులో మార్పు చేసుకోవాల‌ని తెలిపాడు. అప్పుడే ఆ జ‌ట్టు విజ‌యాల బాట ప‌డుతుంద‌ని, మరింత బలంగా పుంజుకోగలదని పుజారా వ్యాఖ్యానించాడు. ఇక చెన్నై త‌న త‌దుప‌రి మ్యాచ్ ను ఈనెల 5న ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడ‌నుంది. చివ‌రి మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ పై ఢిల్లీ ఘ‌న విజ‌యం సాధించింది.