Just In





Sehwag Vs RCB: ఆర్సీబీ పూర్ టీమ్.. టాప్ ప్లేస్ కొన్నాళ్లే.. బెంగళూరును ట్రోల్ చేసిన సెహ్వాగ్
2008లో ప్రారంభమైన ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్. ఏటా వేల కోట్ల టర్నోవర్ ఒక్క సీజన్ ద్వారా జరుగుతుంది. ఈ లీగ్ లో అత్యధికంగా చెన్నై, ముంబై జట్లు ఐదేసీ టైటిళ్లు సాధించాయి.

IPL 2025 Latest Updates: ఈ సీజన్ లో మూడుసార్లు ఫైనలిస్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హవా నడుస్తోంది. వంద శాతం సక్సెస్ రేట్ తో విజయాలు సాధించింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచింది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై అలవోక విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. అయితే తాజాగా ఆర్సీబీని ట్రోల్ చేస్తూ, భారత మాజీ విధ్వంసక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్లు చేశాడు.
ఆర్సీబీ ఒక పేద జట్టని, కొంతకాలంగా టాప్ ప్లేస్ ను ఎంజాయ్ చేస్తోందని, అది ఎంత కాలం ఉంటుందో తెలియదని, అప్పటివరకు అస్వాదించమన్నట్లుగా పేర్కొన్నాడు. ఐపీఎల్ ప్రారంభమైన 17 సీజన్ల నుంచి ఆర్సీబీ ఆడుతోంది. అయితే ఇప్పటవరకు ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు. మూడుసార్లు ఫైనల్ కు వెళ్లినా, డెక్కన్ ఛార్జర్స్ (ఇప్పుడు మనుగడలో లేదు), చెన్నై, సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో కప్పులేని పేద జట్టు అని సెహ్వాగ్ ట్రోల్ చేశాడు.
నాలుగు జట్లకు టైటిల్స్ లేవు..
ఇక ఐపీఎల్లో ఆడుతున్న పది జట్లలో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కప్పు సాధించలేదు. ఇక 2022 నుంచి ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ ఖాతాలో కప్పు లేదు. ఆ జట్టు కనీసం ఫైనల్ కూడా చేరలేదు. ఈ నేపథ్యంలో ఈ నాలుగు జట్లు కప్పు లేని పేద జట్లని సెహ్వాగ్ చమత్కరించాడు. ఐపీఎల్ లోని అన్ని జట్లు చాలా రిచ్ అని, ఏడాది, ఐదారు వందల కోట్లను సంపాదిస్తాయని పేర్కొన్నాడు. మరోవైపు ఆర్సీబీని పేద జట్టు అని ట్రోల్ చేసిన సెహ్వాగ్ ను కొంతమంది ఆర్సీబీ అభిమానులు కూడా ట్రోల్ చేస్తున్నారు.
సెహ్వాగ్ కూడా పేదోడే..
ఐపీఎల్ ఆడిన ఆటగాళ్లలో సెహ్వాగ్ ప్రాతినిథ్యం వహించిన జట్లు టైటిల్ గెలవలని, ఈ రకంగా చూస్తే సెహ్వాగ్ కూడా పేదోడేనని పలువురు ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ ఆరంభంలో సొంత నగరానికి చెందిన ఢిల్లీ డేర్ డేవిల్స్ కు ఆడిన సెహ్వాగ్, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ కు ఆడాడు. ఆ తర్వాత కొంతకాలనికి రిటైర్ అయ్యాడు. ఈ రెండు జట్లు కూడా ఐపీఎల్ టైటిల్ సాధించలేదని గుర్తు చేస్తున్నాడు. ఇక ఈసారి ఐపీఎల్ ఆసక్తికరంగా సాగుతోంది. లీగ్ లో ఒక పంజాబ్ మినహా మెజారిటీ జట్లు మూడేసి మ్యాచ్ లను పూర్తి చేశాయి. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా, డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. బుధవారం పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మద్య మ్యాచ్ జరుగుతుంది. ఇరుజట్లు తమ చివరి మ్యాచ్ లో గెలిచి మంచి జోరుమీదున్నాయి.