IPL 2025 PBKS VS DC Match Updates: పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్ ర‌ద్ద‌య్యింది. ఫ్ల‌డ్ లైట్ ఫెయిల్యూర్ తో పాటు, స‌రిహ‌ద్దుల్లో పాక్ దాడి చేసే అవకాశ‌ముంద‌ని, ముందు జాగ్ర‌త్త‌గా మ్యాచ్ ను ర‌ద్దు చేశారు. దీంతో ఇరుజ‌ట్ల‌కు చెరో పాయింట్ కేటాయించనున్నారు. గురువారం మ్యాచ్ జ‌రుగుతున్న ధ‌ర్మ శాల స్టేడియం స‌రిహద్దుకు ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అంత‌కుముందు టాస్ గెలిచి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్.. 10.1 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 122 ప‌రుగులు చేసింది. ప్రియాంశ్ ఆర్య (70), ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ (50 నాటౌట్) అర్థ సెంచ‌రీలు చేశారు. ఇక హై సెక్యురిటీ మ‌ధ్య ఇరుజ‌ట్ల‌ను సుర‌క్షిత ప్రాంతానికి ఆర్మి త‌ర‌లించింది. రైలు మార్గంలో ఢిల్లీ జ‌ట్టును ఢిల్లీకి త‌ర‌లించ‌నున్నారు. ఇక ఈనెల 11 న ఇదే స్టేడియంలో జ‌రిగే మ్యాచ్ ను ఇప్ప‌టికే ముంబైకి షిఫ్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక పంజాబ్ టీం ను కూడా రైలు మార్గంలో అహ్మదాబాద్ కు త‌ర‌లించే అవ‌కాశ‌మున్న‌ట్లు స‌మాచారం. మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో స్టేడియంలో ప్రేక్ష‌కులు పూర్తిగా బ‌య‌ట‌కు వెళ్లేవ‌రకు.. ఒక స్టాండ్ వైపు మాత్ర‌మే లైట్స్ ఆన్ చేశారు. ఎలాంటి తొక్కిస‌లాట జ‌రుగ‌కుండా ప్రేక్ష‌కులు సుర‌క్షితంగా బ‌య‌ట‌కు వెళ్లేలా స్థానిక పోలీసుల‌తో  క‌లిసి, ఆర్మీ ప‌ర్య‌వేక్షిస్తోంది. 

 

 

ధనాధన్ ఆటతీరు.. 

అంత‌కుముందు వ‌ర్షం కార‌ణంగా టాస్ ఆల‌స్య‌మైంది.  ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా ఇరువురు ఆటగాళ్లు పోటీపడి మరీ పరుగులు సాధించారు. ఇద్ద‌రు పోటీప‌డి బౌండ‌రీలు సాధించ‌డంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. ముఖ్యంగా ఫ‌స్ట్ ఓవ‌ర్లోనే ఆర్య రెండు ఫోర్లతో 11 పరుగులు సాధించారు.  ఆ త‌ర్వాత తను నాలుగో ఓవ‌ర్లో రెండు సిక్స‌ర్లు, ఒక ఫోర్ తో స‌త్తా చాటాడు. ఇక కుల్దీప్ యాద‌వ్ వేసిన 10వ ఓవ‌ర్లో ప్రియాంశ్ ఆర్య వీరంగం ఆడాడు. అత‌ను క‌ళ్లు చెదిరే  రెండు సిక్స‌ర్లు బాద‌గా, త‌ర్వాత స్ట్రైక్ కి వ‌చ్చిన ప్ర‌భ్ సిమ్రాన్ ఒక ఫోర్ బాద‌డంతో ఏకంగా 19 ప‌రుగులు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ప‌వ‌ర్ ప్లేలో 69 ప‌రుగులు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో 25 బంతుల్లో ఆర్య‌, 28 బంతుల్లో ప్ర‌భ్ సిమ్రాన్ ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. 11వ ఓవ‌ర్ తొలి బంతికి న‌ట‌రాజ‌న్ బౌలింగ్ లో తివారీకి క్యాచ్ ఆర్య వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత మ్యాచ్ సాధ్య ప‌డ‌లేదు.