IPL 2025 KKR VS CSK Updates: చెన్నై సూప‌ర్ కింగ్స్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ఓడిన బాధ‌లో ఉన్న కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు షాక్ త‌గిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిపై బీసీసీఐ క‌న్నెర్ర చేసింది. అభ్యంత‌ర‌క‌రంగా సిగ్న‌ల్ చేసినందుకుగాను అత‌డిపై కొర‌డా ఝ‌ళిపించింది. బుధ‌వారం ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 179 ప‌రుగులు చేసింది. అజింక్య ర‌హానే కెప్టెన్ ఇన్నింగ్స్ (33 బంతుల్లో 48, 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) తో స‌త్తా చాటాడు. బౌల‌ర్ల‌లో నూర్ అహ్మ‌ద్ నాలుగు వికెట్లు తీశాడు. ఛేజింగ్ లో చెన్నై 19.4 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 183 ప‌రుగులు చేసింది. డెవాల్డ్ బ్రివిస్ విధ్వంస‌క‌ర ఫిఫ్టీ  (25 బంతుల్లో 52, 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. వైభ‌వ్ అరోరా కు మూడు వికెట్లు ద‌క్కాయి. అయితే ఈమ్యాచ్ లో బ్రివిస్ ను ఔట్ చేసిన త‌ర‌వాత ఇక ఇక్క‌డి నుంచి వెళ్లిపో అన్న‌ట్లుగా వ‌రుణ్ చేతితో సంజ్ఞ చేశాడు. తాజాగా దీనిపై ఐపీఎల్ యాజ‌మాన్యం క‌న్నెర్ర చేసింది. 

Continues below advertisement

Continues below advertisement

భారీ జ‌రిమానా..ఐపీఎల్ ప్లేయ‌ర్ల ప్ర‌వ‌ర్త‌న నియామ‌వ‌ళిని ఉల్లంఘించినందుకుగాను అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం జ‌రిమానా విధిస్తున్న‌ట్లు తెలిపింది. అత‌ను పాల్ప‌డిన నేరం ఆర్టిక‌ల్ లోని 2.5లోని లెవ‌ల్ 1 కింద‌కి వ‌స్తుంద‌ని మ్యాచ్ రిఫ‌రీ నిర్ణయించి, జ‌రిమానా విధించి, ఒక డీ మెరిట్ పాయింట్ కూడా కేటాయించిన‌ట్లు పేర్కొంది. రిఫ‌రీ నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అని దీనిపై ఇక వాదోప‌వాదాల‌కు అవ‌కాశం లేద‌ని తెలిపింది. మ‌రోవైపు గ‌తేడాది చాంపియ‌న్ గా నిలిచి, ఈ ఏడాది డిఫెండింగ్ చాంపియ‌న్ గా బ‌రిలోకి దిగిన కేకేఆర్ ప్లే ఆఫ్ రేస్ ఎలిమినేష‌న్ ముంగిట నిలిచింది. ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచ్ లు ఆడిన ఆ జ‌ట్టు ఐదు విజ‌యాలు, ఒక ర‌ద్దుతో క‌లిపి 11 పాయింట్ల‌తో ఉంది. లీగ్ లో ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. 

రెండు గెలిస్తేనే..కేకేఆర్ ఆడాల్సిన మ్యాచ్ ల విష‌యానికొస్తే ఈనెల 10న హైద‌రాబాద్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో అలాగే ఈనెల 17న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో బెంగ‌ళూరులో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ లు గెల‌వ‌డంతోపాటు మిగ‌తా జ‌ట్ల ఫ‌లితాలు కూడా కేకేఆర్ కు అనుకూలంగా రావాల్సి ఉంది. ఏదేమైనా మూడుసార్లు చాంపియ‌న్ గా నిలిచిన కేకేఆర్ ఈసారి మాత్రం ప్లే ఆఫ్స్ కు చేరుకోవ‌డం చాలా క‌ష్టంగా మారింది. ఇక ఈ సీజ‌న్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్, రాజ‌స్తాన్ రాయ‌ల్స్, స‌న్ రైజ‌ర్స్ ఆల్రెడీ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్ర‌మించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆదివారం వ‌ర‌కు ప్లే ఆఫ్ విష‌యంలో మ‌రింత క్లారిటి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ప్ర‌స్తుతం గుజ‌రాత్ టైటాన్స్ టాప్ ప్లేస్ లో నిలిచింది.