IPL 2025 LSG VS MI Update:  ముంబై ఇండియ‌న్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ‌ధ్య శుక్ర‌వారం జ‌రిగిన మ్యాచ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ముఖ్యంగా ముంబై ఇన్నింగ్స్ లో లాస్ట్ ఏడు బంతులు మిగిలున్న క్ర‌మంలో తెలుగు ప్లేయ‌ర్ తిల‌క్ వ‌ర్మ (23 బంతుల్లో 25)ని రిటైర్డ్ ఔట్ చేయాల‌ని నిర్ణ‌యించ‌డం చాలా మందికి మింగుడు ప‌డ‌లేదు. ముంబై త‌ర‌పున ఎన్నో మ‌రుపురాని ఇన్నింగ్స్ ఆడిన తిల‌క్ ను అలా ఎలా రిటైర్ చేస్తార‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక ఈ నిర్ణ‌యాన్ని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స‌మ‌ర్థించుకున్నాడు. మ్యాచ్ అనంత‌రం మాట్లాడుతూ.. ఒక‌నొక స‌మ‌యంలో బ్యాట‌ర్లు ట‌చ్ కోల్పోతార‌ని, వారు ఎంత ప్ర‌య‌త్నించినా షాట్ల‌ను స‌రిగ్గా క‌నెక్టు చేయ‌లేక పోతార‌ని పేర్కొన్నాడు. ల‌క్నోతో మ్యాచ్ లో అలాగే జ‌రిగింద‌ని, అందుకే అలాంటి నిర్ణ‌యం తీసుకున్నామ‌ని పేర్కొన్నాడు. ఇక ముంబై మేనేజ్మెంట్, హార్దిక్ క‌లిసి తీసుకున్న ఈ నిర్ణ‌యం బ్యాక్ ఫైర‌య్యింది. తిల‌క్ ప్లేస్ లో వ‌చ్చిన మిషెల్ శాంట్న‌ర్ కేవ‌లం రెండు బంతుల్లో రెండు ప‌రుగులు మాత్రమే చేశాడు. ఇంత దానికి అత‌డిని ఎందుకు పిలిచారని ఫైరవుతున్నారు. 

స్ట్రైక్ నిరాకరించిన పాండ్యా..హిట్ట‌ర్ కావాల‌ని ఏరీ కోరి శాంట్న‌ర్ ను తీసుకుని, అతనికి చివ‌రి ఓవ‌ర్లో స్ట్రైక్ ఇవ్వ‌క‌పోవ‌డం ఏంట‌ని హార్దిక్ వైఖ‌రిని చూసి నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఏడు బంతుల్లో 24 ప‌రుగులు చేయాల్సిన ద‌శ‌లో తిల‌క్ రిటైర్ అయ్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన శాంట్న‌ర్ త‌ను ఎదుర్కొన్న తొలి బంతికి రెండు ప‌రుగులు సాధించాడు. త‌ర్వాతి ఓవ‌ర్లో 22 ప‌రుగులు చేస్తుంద‌న్న ద‌శ‌లో అవేశ్ ఖాన్ ఆ ఓవ‌ర్ వేశాడు. తొలి బంతికి సిక్స‌ర్, రెండో బంతికి రెండు ప‌రుగులు సాధించిన హార్దిక్.. ఆ త‌ర్వా త రెండు బంత‌ులను వేస్ట్ చేశాడు. ఆ రెండు బంతుల‌కు సింగిల్స్ వ‌చ్చే అవ‌కాశ‌మున్నా శాంట్న‌ర్ కు స్ట్రైక్ ఇవ్వ‌డానికి నిరాక‌రించాడు. ఇక ఐదో బంతికి సింగిల్ తీసి, తాపీగా స్ట్రైక్ శాంట్న‌ర్ కు ఇచ్చాడు. ఆరో బంతికి ప‌రుగురాలేదు. దీంతో 12 ప‌రుగుల‌తో ముంబై ఓడిపోయింది. మొత్తానికి హిట్ట‌ర్ గా బ‌రిలోకి దింపితే శాంట్న‌ర్ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడ‌ని, ఒక బౌలింగ్ ఆల్ రౌండ‌ర్ కోసం, ఫర్ఫెక్ట్ బ్యాట‌ర్ ను రిటైర్ చేయ‌డం ఏంట‌ని, అటు ముంబై మేనేజ్మెంట్ ని, ఇటు హార్దిక్ ను ఫ్యాన్స్ ఏకి ప‌డేస్తున్నారు. 

గ‌తంలోనూ రిటైర్డ్ ప్లేయ‌ర్లు.. ఐపీఎల్ మ్యాచ్ మ‌ధ్య‌లో ప్లేయ‌ర్లు ఇలా రిటైర్ అవ్వ‌డం గ‌తంలోనూ జ‌రిగింది. తొలిసారిగా 2022లో వాంఖ‌డేలో జ‌రిగిన మ్యాచ్ లో ర‌విచంద్ర‌న్ అశ్విన్.. ల‌క్నోపైనే రిటైర్ అయ్యాడు. ఆ త‌ర్వాత 2023లో ధ‌ర్మ‌శాల‌లో జ‌రిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై అథ‌ర్వ తైడే, అదే ఏడాది ముంబై ఇండియ‌న్స్ పై సాయి సుద‌ర్శ‌న్ అహ్మ‌దాబాద్ లో ఇదే ర‌కంగా రిటైర్ అయ్యాడు. దీంతో ఇలా రిటైర్ అయిన ఆట‌గాళ్ల జాబితాలో తిల‌క్ నాలుగో ప్లేస్ లో నిలిచాడు. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్లో 8 వికెట్ల‌కు 203 ప‌రుగులు చేసింది. అనంత‌రం ఛేద‌న‌లో ముంబై ఓవ‌ర్ల‌న్నీ ఆడి 5 వికెట్ల‌కు 191 ప‌రుగులు చేసింది.