IPL 2025 LSG Superb Victory: సొంతగడ్డపై లక్నో మళ్లీ విజయాల బాట పట్టింది. శుక్రవారం లక్నోలోని ఏకనా మైదానంలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై 12 పరుగులతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్లకు 203 పరుగులు చేసింది. ఓపెనర్ మిషెల్ మార్ష్ (31 బంతుల్లో 60, 9 ఫోర్లు, 2 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య కెరీర్ లో తొలిసారి ఫైవ్ వికెట్ హాల్ (5-36) సాధించాడు. అనంతరం ఛేదనలో ముంబై ఓవర్లన్నీ ఆడి 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ (43 బంతుల్లో 67, 9 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ (1-21) పొదుపుగా బౌలింగ్ చేశాడు.
అదరగొట్టిన మార్ష్.. ఈ మ్యాచ్ లో ఓపెనర్ మార్ష్ విశ్వరూపం ప్రదర్శించాడు. గత మ్యాచ్ లో విఫలమైనా, అదేమీ పట్టించుకోకుండా ఈ మ్యాచ్ లో ఆది నుంచే సత్తా చాటాడు. మరో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (53) కూడా అతనికి సహాకారం అందించడంతో మార్ష్ రెచ్చిపోయాడు. ఆరంభంలో నుంచే దూకుడుగా ఆడినా మార్ష్.. కేవలం 27 బంతుల్లో ఫిఫ్టీ సాధించి, స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో మార్ష్ ఔటయ్యాడు. దీంతో తొలి వికెట్ కు నమోదైన 76 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మధ్యలో మిడిలార్డర్ విఫలమైనా మార్క్రమ్ మాత్రం దూకుడుగా ఆడి 34 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. చివర్లో ఆయుష్ బదోనీ (30), డేవిడ్ మిల్లర్ (27) ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో లక్నో 200 పరుగుల మార్కును దాటింది.
సూర్య కుమార్ వీరంగం.. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబైకి మళ్లీ శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు విల్ జాక్స్ (5), ర్యాన్ రికెల్టన్ (10) విఫలమయ్యారు. అయితే నమన్ ధీర్ (24 బంతుల్లో 46, 4 ఫోర్లు, 3 సిక్సర్లు)తో కలిసి సూర్య ఛేజింగ్ ను ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూమూడో వికెట్ కు 71 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే ఫిఫ్టీకి చేరువైన దశలో నమన్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (25) దూకుడుగా ఆడలేకపోయాడు. అయితే ఒక ఎండ్ లో మాత్రం సూర్య కుమార్ తన ప్రతాపం చూపించాడు. 9 ఫోర్లు, 1 భారీ సిక్సర్ తో సత్తా చాటాడు. దీంతో 31 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. అయితే సూర్య ఔటైన తరవాత పరుగుల రాక మందగించింది. తిలక్.. వేగంగా పరుగులు సాధించడంలో విఫలం కావడంతో 19వ ఓవర్లో అతడిని రిటైర్డ్ గా పెవిలియన్ కు పంపిచారు. ఇక చివరి రెండో ఓవర్లలో 29 పరుగులు కావాల్సి ఉండగా, బౌలర్లు అద్భుతంగా రాణించడంతో 16 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో లక్నో ఉత్కంఠ భరిత విజయం సాధించింది.