IPL 2024 Mumbai Indians 250th Match : హార్దిక్ పాండ్యా(Hardic Pandya) కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్(MI)  మూడో ఓటమి మూటగట్టుకుంది. ముంబయి ఇండియన్స్ ఖాతా తెరవకుండానే వరుసగా మూడు సార్లు ఓడి హ్యాట్రిక్ పరాజయాల పాలైంది. మ్యాచ్ పోతే పోయింది గానీ ఈ జట్టు అరుదైన ఘ‌న‌త సాధించింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో 250 మ్యాచ్‌లు ఆడిన మొద‌టి జ‌ట్టుగా ముంబై రికార్డుల్లోకెక్కింది.  ఐపీఎల్‌ 2024లో భాగంగా  ఏప్రిల్ 1 వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌(RR)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఈ ఫీట్ అందుకుంది. మొత్తం ఐపీఎల్ జరిగిన  17 ఎడిషన్లలో కలిపి  ముంబై జట్టు 250 మ్యాచ్‌లు ఆడింది. ముంబై ఇండియన్స్‌ తర్వాత ఐపీఎల్ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్ధానంలో ఉంది. 


ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్లు 
ముంబయి ఇండియన్స్(MI) - 250 మ్యాచ్‌లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) - 244 మ్యాచ్‌లు
దిల్లీ క్యాపిటల్స్(DC) - 241 మ్యాచ్‌లు
కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) - 239 మ్యాచ్‌లు
పంజాబ్ కింగ్స్(PBKS) - 235 మ్యాచ్‌లు
చెన్నై సూపర్ కింగ్స్(CSK) - 228 మ్యాచ్‌లు


రోహిత్ శర్మ కెప్టెన్ గా  ముంబై ఇండియన్స్‌ జట్టు తొలిసారి  2013లో టైటిల్ అందుకుంది. తరువాత  2015, 2017, 2019 మరియు 2020లో ముంబై ఐపీఎల్ టైటిల్ కొట్టింది. ముంబై ఇప్పటివరకు ఐదు ఐపీఎల్ టైటిల్స్ సాధించింది. అత్యధిక మ్యాచ్‌లు కూడా ఆడింది.  


పాండ్యను వదలని ఫ్యాన్స్ 


 ఏ ముహూర్తంలో అయితే ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా  హార్దిక్ పాండ్యా అడుగుపెట్టాడో గానీ అతనిపై విమర్శలు అస్సలు తగ్గడం లేదు. 5 టైటిల్స్ నెగ్గిన రోహిత్ ను కాదని పాండ్యని నాయకుడిగా చేశారో అప్పటి నుంచి ట్రోలర్స్ పాండ్య మీదే పడ్డారు. నిజానికి లీగ్ ఆరంభంలో విజయాలు, అపజయాలు ఎవరికైనా తప్పవు. కానీ దీనిని పాండ్య కెప్టెన్సీ కి లింక్ చేసి అభిమానులు మండిపడుతున్నారు.  మూడు మ్యాచ్ లలో  బోణీ కూడా కొట్టకపోవడంతో  ఉతికి ఆరేస్తున్నారు.


ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ 1న ముంబయి ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​లోనూ టాస్ వేసే సమయం నుంచి అయిపోయే వరకు పాండ్యాను ఫ్యాన్స్ ఎగతాళి చేస్తూనే ఉన్నారు.  అసలు ఇప్పుడే కాదు పాండ్య ఎక్కడ ఆడినా ఇదే పరిస్థితి , సోషల్ మీడియాలో అయితే ఎవరూ తగ్గేదేలే. ఈ మ్యాచ్ లో కూడా రాజస్థాన్‌(RR)తో  తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ముంబై బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడమే గగనమైంది. తొలి ఓవర్‌లో మొదలైన ముంబై కష్టాలు చివరి ఓవర్‌ వరకూ కొనసాగాయి. తరువాత  ముంబయి నిర్దేశించిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ముంబయి టీం కి ఓటమి పరంపర కొనసాగినట్టైంది. 


 మ్యాచ్‌ అనంతరం ఓటమిపై  కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య  తమ జట్టు మరింత క్రమశిక్షణతో, ధైర్యంగా ఆడాల్సిందని అన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో జట్టుగా ఉత్తమ ప్రదర్శన ఇవ్వగలమనే నమ్మకం తమకు ఉందని అన్నాడు