Suresh Raina - MS Dhoni: 
 
చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఎంఎస్‌ ధోనీ ఎలాగో సురేశ్ రైనా అంతే! అలాంటిది 2021 సీజన్లో అతడిని చాలా మ్యాచుల్లో దూరం పెట్టారు. అతడి స్థానంలో రాబిన్‌ ఉతప్పను ఆడించారు. అయితే జట్టులోంచి తప్పించే ముందు మహీ తన పర్మిషన్‌ తీసుకున్నాడని మిస్టర్‌ ఐపీఎల్‌ చెప్పాడు.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరు పొందిన సురేశ్‌ రైనాను కొత్తగా వచ్చిన రాబిన్‌ ఉతప్ప కోసం తప్పించారు. సీజన్‌కు ముందే రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి అతడిని ట్రేడ్‌ చేసుకున్నారు. దిల్లీ మ్యాచులో ఇది జరిగింది. ఆ తర్వాత రైనా అస్సలు తుది జట్టులోకి రానే రాలేదు. టాస్‌కు ముందు అతడు గాయపడ్డాడని మహీ చెప్పడం గమనార్హం.


రాబిన్‌ ఉతప్పతో జరిగిన చర్చలో సురేశ్‌ రైనా ఈ విషయాలు వెల్లడించాడు. దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచులో రైట్‌ హ్యాండర్‌ బ్యాటర్‌ను తీసుకోవడం వ్యూహాత్మక అంశమని వివరించాడు.  అందుకోసమే ఎంఎస్‌ ధోనీ తనని ముందుగా సంప్రదించాడని తెలిపాడు.


'దిల్లీ మ్యాచుకు ముందు నేను, ఎంఎస్‌ ధోనీ మాట్లాడుకున్నాం. రాబిన్‌ ఉతప్పను ప్రయత్నించడం మంచిదని నేను సలహా ఇచ్చాను. నిన్ను ఆడించేందుకు అతడు నా పర్మిషన్‌ తీసుకున్నాడు. నన్ను నమ్ము! ఉతప్ప మనల్ని ఫైనల్‌కు తీసుకెళ్తాడని నేను నచ్చచెప్పాను' అని రైనా వివరించాడు. 'నేను లేని తుది జట్టును తీసుకోవడం ధోనీ డిక్షనరీలోనే లేదు. 2008 నుంచి మనిద్దరం కలిసి ఆడుతున్నామని మహీ చెప్పాడు. తాను ఈ సీజన్‌ ఎలాగైనా గెలవాలని పేర్కొన్నాడు. దాంతో రాబిన్‌ను మూడో స్థానంలో ఆడించాలని, ఫైనల్‌ వరకు అలాగే కొనసాగించాలని సూచించాను. నువ్వు గెలిస్తే సీఎస్కే గెలిచినట్టే. ఎవరు ఆడినా ఒక్కటే. రాబిన్‌, రైనాకు తేడా లేదని చెప్పా' అని సురేశ్ రైనా వెల్లడించాడు.


ఐపీఎల్‌ 2021లో రాబిన్‌ ఉతప్ప 4 మ్యాచులు ఆడి 115 పరుగులు చేశాడు. 136.90 స్ట్రైక్‌రేట్‌ నమోదు చేశాడు. ఈ సీజన్‌ ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ 27 పరుగుల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. కాగా తర్వాతి సీజన్లోనే మహీ సేన చిత్తుగా ఓడింది. పాయింట్ల పట్టికలో ఆఖర్లో నిలిచింది. మళ్లీ 2023లో టైటిల్‌ గెలిచి ఔరా అనిపించింది. సీనియర్‌ బౌలర్లు లేనప్పటికీ తెలివైన వ్యూహాలతో మహీ జట్టును విజయ తీరాలకు చేర్చాడు.