IPL 2025 CSK VS DC Updates: చెన్నై సూపర్ కింగ్స్ ను మళ్లీ ఎంఎస్ ధోనీ కెప్టెన్ గా ముందుకు నడిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా మ్యాచ్ కు దూరమవడంతో తిరిగి ధోనీ పగ్గాలు చేపట్టే చాన్స్ ఉంది. నిజానికి రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ ఫిఫ్టీతో సత్తా చాటాడు. అయితే అదే మ్యాచ్ లో పేసర్ తుషార్ దేశ్ పాండే బౌలింగ్ లో గాయానికి గురయ్యాడు. వేగంగా వచ్చిన బంతి బలంగా తాకడంతో చేతిపై గాయమైంది. దీంతో ఇప్పటివరకు తను కోలుకోలేదని తెలుస్తోంది. అయితే రుతురాజ్ ఆడేది..? ఇప్పుడే చెప్పలేమని చెన్నై టీమ్ మేనేజ్మెంట్ పేర్కొంది. ప్రాక్టీస్ సెషన్ ముగిశాక దీనిపై స్పష్టత వస్తుందిన పేర్కొంది. ఇక చెన్నైకి కెప్టెన్ ఎవరైనా, అందరి కళ్లు ధోనిపైనే ఉంటాయనడంలో సందేహం లేదు. ఇక రెండేళ్ల తర్వాత ధోనీ.. చెన్నై పగ్గాలు చేపడతాడా..? అనే దానిపై చర్చ జరుగుతోంది.
రెండేళ్ల తర్వాత ..ఐపీఎల్లో చెన్నైకి కెప్టెన్ గా ధోనీ రెండేళ్ల కిందట బాధ్యత వహించాడు. 2023లో చెన్నైకి చివరిసారిగా కెప్టెన్ గా వ్యవహరించిన ధోనీ, ఆ ఎడిషన్ లో చెన్నైని విజేతగా నిలిపాడు. దీంతో రికార్డు స్థాయిలో ఐదోసారి చెన్నై చాంపియన్ గా నిలిచింది. ఆ తర్వాత ఎడిషన్ నుంచి కెప్టెన్ గా ధోనీ దిగిపోయిన తర్వాత, రుతురాజ్ కెప్టెన్ గా బాధ్యతులు స్వీకరించాడు. అయితే గతేడాది ఐదో స్థానంలో నిలిచి, త్రుటిలో ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశాన్ని చెన్నై కోల్పోయింది. దీంతో ఎలాగైనా ఈ సీజన్ లో ఫస్ట్ ఫ్లే ఆఫ్స్ కు చేరుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది.
నిరాశలో చెన్నై.. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో చెన్నై కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో సాధికారిక విజయం సాధించింది. అయితే ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ చెన్నై ఓడిపోయింది. ఆర్సీబీ చేతిలో 50 పరుగులతో, రాజస్థాన్ చేతిలో 6 పరుగులతో ఓడిపోయింది. ముఖ్యంగా ఆర్సీబీ చేతిలో గెలుపు కోసం ప్రయత్నించకుండా ఓడిపోవడం, తొమ్మిదో స్థానంలో ధోనీ బ్యాటింగ్ కు దిగడంతో చెన్నై ట్రోల్స్ కి గురైంది. ఈ నేపథ్యంలో శనివారం సొంతగడ్డ చేపాక్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగాలని చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ గా పెట్టుకుంది. మరో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది.