IPL 2025 MS Dhoni vs Virat Kohli: ఆటగాళ్ల వయసు, రిటైర్మెంట్ పై ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మొయిన్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఒక మీడియాతో మాట్లాడుతూ.. పెద్ద ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఉందని, పరుగులు చేయకున్నా జట్టులో కొనసాగడం కరెక్టు కాదని వ్యాఖ్యానించాడు. ఇటీవల కొంతమంది ప్లేయర్లు వయసు మీరినా రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇష్టపడటం లేదు. ముఖ్యంగా టెస్టుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వరుసగా విఫలం అవుతున్నప్పటికీ, రిటైర్మెంట్ ప్రకటించడం లేదు. జట్టుకు భారంగా మారుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఐపీఎల్లో 43 ఏళ్ల వయసులో కూడా రిటైర్మెంట్ ప్రకటించకుండా ఆడుతున్న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తొమ్మిదో నెంబర్లో బ్యాటింగ్ కు దిగి ఇటీవల తీవ్రంగా విమర్శల పాలయ్యాడు. అలాగే గెలవడం కోసం కాకుండా, చివర్లో కొన్ని బౌండరీలు బాదీ, జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడనే చర్చ జరుగుతోంది. అలాగే రోహిత్ శర్మ వరుసగా విఫలం అవుతుండటపై కూడా విమర్శలు వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ కు సరైన ఆరంభాలు రాకపోవడానికి కారణం రోహితేనని పలువురు ఆరోపిస్తున్నారు.
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ వేర్వేరు..అయితే ఐపీఎల్ లాంటి టోర్నీల్లో రిటైర్మెంట్ ప్రకటన ఆటగాళ్ల వ్యక్తిగత ఇష్టమని, ఫ్రాంచైజీకి ఇబ్బంది లేనంతకాలం వాళ్లు కొనసాగవచ్చునని పేర్కొన్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్ అనేది ప్రైవేట్ ఆటని, అందులో ఆటగాళ్ల వ్యక్తిగత ఇష్టయిష్టాలే కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే మాత్రం ఈ తేడా వేరుగా ఉంటుందని తెలిపాడు. దేశం ముఖ్యమని, తాను అందుకే జాతీయ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించి, ఐపీఎల్ లాంటి లీగ్ ల్లో ఆడుతున్నాని పేర్కొన్నాడు.
ఆటగాళ్లు నిర్ణయం తీసుకోవాలి.. జాతీయ జట్టులో కొనసాగడంపై ఆటగాళ్లే నిర్ణయం తీసుకోవాలని మొయిన్ అలీ సూచించాడు. ఆటకు తగినట్లుగా తమ శరీరం సహకరించనప్పుడు వైదొలగడం మేలని వ్యాఖ్యానించాడు. ఎందుకంటే వ్యక్తిగత విషయాల కంటే దేశమే ప్రధానమని, తమ కంటె మెరుగ్గా ఆడుతున్న ఆటగాళ్ల కోసం వైదొలగాలని సూచించాడు. ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, ఫ్యాన్ బేస్ లాంటి విషయాల కంటే ఆటతీరునే ప్రమాణికంగా తీసుకోవాలని పేర్కొన్నాడు. దేశం కోసం ఆలోచించేటప్పుడు స్వార్థ పూరితంగా కాకుండా వాస్తవిక ధోరణితో, సానుకూల దృక్పథంతో ఆలోచించాలని పేర్కొన్నాడు. ప్రస్తుతం మొయిన్ అలీ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అటు స్పిన్నర్ గాను, ఇటు లెప్టాండర్ బ్యాటర్ గాను తను బరిలోకి దిగగలడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ తదితర జట్లకు తన ప్రాతినిథ్యం వహించాడు.