MI vs KKR Match Highlights: 16 మే 2012. ముంబై వాంఖడే స్టేడియంలో కోల్‌కతా ఆఖరిసారి మ్యాచ్ గెలిచిన రోజు. అప్పుడు కేకేఆర్‌ 140 కొడితే ముంబై ఛేజింగ్‌లో 108 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అప్పుడు సునీల్ నరైన్ 4 వికెట్లు తీసి కోల్‌కతా మ్యాచ్ గెలిపించటంతోపాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గానూ నిలిచాడు. ఇక అంతే మళ్లీ 12సంవత్సరాల పాటు వాంఖడేలో కోల్‌కతా గెలిచిందే లేదు. 


అది మనసులో పెట్టుకుందో ఏమో నిన్న(శుక్రవారం, 3 మే 2024 ) పగబట్టి మరీ కొట్టేసింది కేకేఆర్. అసలు ముంబై బౌలర్ల ధాటికి 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశ నుంచి కోలుకుని 169 పరుగులు చేయటమే చాలా గొప్ప అనుకుంటే ప్రత్యర్థిని సొంతగడ్డపై ఆ టార్గెట్ ఛేజ్ చేయనీకుండా అడ్డుకున్నారు కేకేఆర్‌ బౌలర్లు. ముంబై లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ డెప్త్ ఉన్న టీమ్‌ని 145పరుగులకే ఆలౌట్ చేయటం ఆషామాషీకాదు. పుష్కరం తర్వాత విక్టరీ కొట్టడంతోపాటు ముంబై ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా ముగించేసి వాళ్లను అస్సాం ట్రైన్ ఎక్కించేశారు. 


ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది అయ్యర్, మనీష్ పాండే పోరాటం గురించి. కుప్పకూలిపోయే దశ నుంచి కోల్‌కతాను ఈ ఇద్దరే ఆదుకుని గౌరవ ప్రదమైన స్కోరును అందించారు. ఇక మిగిలిన పనిని కేకేఆర్‌ బౌలర్లు పూర్తి చేశారు. నరైన్, వరుణ్ చక్రవర్తి, రసెల్ అందరికంటే గొప్పగా మిచెల్ స్టార్క్ అందరూ అదరగొట్టేయటంతో ముంబైకి ఓటమి పరాభవం తప్పలేదు. ఈ విజయంతో క్వాలిఫైయర్స్ రేసులో రాజస్థాన్ తర్వాత కేకేఆర్ తన స్థానాన్ని పదిలం చేసుకోగలిగింది. మరేదైనా అద్భుతం జరిగితే తప్ప దాదాపుగా ప్లే ఆఫ్స్‌లో కేకేఆర్ ఆడి తీరుతుంది అని ఫ్యాన్స్ ధైర్యంగా చెప్పుకునే స్థాయి విజయాన్ని అందుకుంది కోల్‌కతా నైట్ రైడర్స్.


ముందు టాస్ గెలిచిన ముంబై మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్‌కతాకు తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పియింది. ప్రమాదకరమైన సాల్ట్‌ వికెట్ కోల్పోయింది తర్వాత శ్రేయస్ అయ్యర్, సునీల్ నరైన్‌ ఇలా అంతా క్రమం తప్పకుండా పెవిలియన్ దారి పట్టారు. 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న కేకేఆర్‌కు మనీష్‌ పాండే, వెంకటేష్‌ అయ్యర్ ఆదుకున్నారు. హాఫ్‌ సెంచరీకి చేరువవుతున్న టైంలో మనీష్ పాండే అవుటయ్యాడు. తర్వాత వెంకటేష్‌ ముంబైను ఊపేశాడు. చివరి ఓవర్లలో పరుగుల రాబట్టడానికి శ్రమించాడు. పడుతూ లేస్తూ మొత్తానికి గౌరవ ప్రదమైన 169 పరుగులు చేసింది. వెంకటేష్‌ 70 పరుగులతో ఇంకా ఒక బంతి మిగిలి ఉండగానే ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. ముంబై బౌలర్లు బుమ్రా, తుషార మూడేసి వికెట్లు తీస్తే,, హార్దిక్‌ రెండు వికెట్లు, పియూష్‌ ఒక వికెట్ తీసుకున్నారు.


170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబైకు మొదట్లోనే షాక్ తగిలింది. ఇషాన్, రోహిత్, నమన్‌ ధార్‌, తిలక్ వర్మ, వధేరా, పాండ్యా తక్కువ పరుగులకే అవుటయ్యారు. 71 పరుగులకే కీలకమైన ఆరు వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్‌. సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే పోరాడుతూ కనిపించాడు. 35 బంతుల్లో 56 పరుగులు చేశాడు. అతన్ని రస్సెల్స్ పెవిలియన్‌కు పంపించాడు. తర్వాత వచ్చిన టిమ్ డేవిడ్‌ కాసేపు మెరుపులు మెరిపించాడు. అయితే మిచెల్ స్టార్క్‌ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తిసి పాండ్యా టీం ఓటిమి ఖరారు చేశారు. స్టార్క్ మొత్తంగా నాలుగు వికెట్లు తీసుకున్నాడు.