Mumbai Indians vs Chennai Super Kings: ఐపీఎల్‌ 12వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం చెన్నై 18.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నై తరఫున అజింక్య రహానే (61: 27 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (32: 21 బంతుల్లో, ఐదు ఫోర్లు) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. రహానే 19 బంతుల్లోనే అర్థ శతకం సాధించడం విశేషం. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.


రహానే అవుటాఫ్ సిలబస్
158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డెవాన్ కాన్వేను (0: 4 బంతుల్లో) అవుట్ చేసి బెహ్రెండాఫ్ ముంబైకి మొదటి వికెట్ అందించాడు. తన స్థానంలో క్రీజులోకి వచ్చిన వన్ డౌన్ బ్యాటర్ అజింక్య రహానే తన బ్యాటింగ్‌లోని రెండో కోణాన్ని పరిచయం చేశాడు. మొదటి బంతి నుంచి విరుచుకుపడి ఆడాడు. ఈ క్రమంలో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసేశాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ కావడం విశేషం. తనకు రుతురాజ్ గైక్వాడ్ (40 నాటౌట్: 36 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) చక్కటి సహకారం అందించాడు. రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించిన అనంతరం అజింక్య రహానే అవుటయ్యాడు.


టూ డౌన్‌లో బరిలోకి దిగిన శివం దూబే (28: 26 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు మూడో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. ఆ తర్వాత దూబే అవుటయినా రాయుడుతో (20 నాటౌట్: 16 బంతుల్లో, మూడు ఫోర్లు) కలిసి రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్‌ను ముగించాడు. ముంబై బౌలర్లలో జేసన్ బెహ్రెండాఫ్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ తలో వికెట్ తీశారు.


కట్టడి చేసిన స్పిన్నర్లు
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (32: 21 బంతుల్లో, ఐదు ఫోర్లు), రోహిత్ శర్మ (21: 13 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) మొదటి బంతి నుంచే వేగంగా ఆడారు. దీంతో ముంబై పవర్ ప్లే ఆరు ఓవర్లలోనే 61 పరుగులు సాధించింది. అయితే వేగంగా ఆడే క్రమంలో పవర్‌ప్లేలోనే రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు.


అక్కడ నుంచి ముంబై ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. కామెరాన్ గ్రీన్ (12: 11 బంతుల్లో, ఒక ఫోర్), తిలక్ వర్మ (22: 18 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), టిమ్ డేవిడ్ (31: 22 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు), హృతిక్ షౌకీన్ (18 నాటౌట్: 13 బంతుల్లో, మూడు ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేరుకోగలిగారు. చెన్నై స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితం అయింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. మిషెల్ శాంట్నర్, తుషార్ దేశ్‌పాండేలకు రెండేసి వికెట్లు దక్కాయి. సిసంద మగల ఒక వికెట్ తీసుకున్నాడు.