Rohit Vs SKY VS Tilak: ముంబై ఇండియన్స్ ప్లేయర్లు రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తాజాగా ఒక తుంటరి పని చేశారు. తమ టీమ్ అడ్మిన్ ను ఏకంగా స్విమ్మింగ్ పూల్ లోకి విసిరేశారు. అంతకుముందు అడ్మిన్ ను ముగ్గురు ఎత్తుకుని, స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం పూల్ వద్ద దించి, అనంతరం అక్కడి నుంచి పూల్ లో తోసేశారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ, కామెంట్లు, లైకులతో హోరెత్తిస్తున్నారు. అయితే ఇదంతా సరదాగా చేసిన ఘటనే కావడం విశేషం. తాము బస చేస్తున్న హోటల్ వద్ద ఈ సంఘటన జరిగింది. చాలా సందడిగా ఉన్న ఈ వీడియోలో క్రికెటర్లతో పాటు అక్కడున్న వారు నవ్వులు పువ్వులు పూయించారు. ఇక ముంబై ఇండియన్స్ .. తాజాగా రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో తలపడుతోంది.
హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ.. ఈనెల 23న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో నిషేధం కారణంగా ఆడలేక పోయిన రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో బరిలోకి దిగాడు. గత సీజన్ లో స్లో ఓవర్ రేట్ మిస్టేక్స్ చేయడంతో అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించగా, చెన్నైతో పోరుకు దూరమయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ కు సూర్య కుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లతో చెన్నై విజయం సాధించింది. దీంతో గుజరాత్ తో మ్యాచ్ లో గెలుపే టార్గెట్ గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్లు టోర్నీలో బోణీ కొడతారు. గుజరాత్ కూడా తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఛేదనలో విఫలమైంది.
సత్యనారణయణరాజు బ్యాకప్..ఇక తొలి మ్యాచ్ లో విఫలమైన తెలుగు పేసర్ సత్యనారాయణ రాజును ముంబై టీమ్ బ్యాక్ చేసింది. ఈ మ్యాచ్ లోనూ అతనికి అవకాశం కల్పించింది. చెన్నైతో మ్యాచ్ లో అతను ఒక ఓవర్ వేసి 13 పరుగులు సమర్పించుకున్నాడు. తర్వాత మ్యాచ్ లో అతనికి అవకాశం కష్టమే అనుకున్నా, రాజుకు మరొక అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. ఇక ఈ మ్యాచ్ లో అమలాపురం కుర్రాడు ఎలా రాణిస్తాడో చూడాలి. ఇక చెన్నై చేతిలో ఓడిపోవడంతో గత 13 సీజన్లుగా తొలి మ్యాచ్ ను ఓడిపోతూ వస్తోంది. 2012లో చివరిసారిగా సీజన్ తొలి మ్యాచ్ ను గెలిచిన ముంబై, మళ్లీ ఆ ఫీట్ ను సాధించలేక పోతోంది.