IPL 2025 LSG Consolation Win: నాలుగు వరుస పరాజయాల తర్వాత ఎట్టకేలకు లక్నో విజయం సాధించింది. టోర్నీలో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్ పై 33 పరుగులతో గెలిచి, ఊరట విజయం సాధించింది. ఈ ఫలితంతో క్వాలిఫయర్ 1కు అర్హత సాధించాలనే జీటీ కి చేదు అనుభవం ఎదురైంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 235 పరుగులు సాధించింది. ఓపెనర్ మిషెల్ మార్ష్ విధ్వంసక సెంచరీ (64 బంతుల్లో 117, 10 ఫోర్లు, 8 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం ఛేజింగ్ లో ఓవర్లన్నీ ఆడిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ షారూఖ్ ఖాన్ స్టన్నింగ్ ఫిఫ్టీ (29 బంతుల్లో 57, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. విలియం ఓ రౌర్క్ కు మూడు వికెట్లు దక్కాయి.
ఓపెనర్ల విధ్వంసం..ఇప్పటికే నాకౌట్ కు దూరమైన లక్నో.. ఈ మ్యాచ్ లో తన ప్రతాపం చూపించింది. ముఖ్యంగా ఓపెనర్ మార్ష్.. ఆరంభం నుంచే దూకుడే మంత్రంగా ఆడాడు. మరో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (36) యాంకర్ ఇన్నింగ్స్ ఆడగా, మార్ష్ మాత్రం విధ్వంసం సృష్టించాడు. ఎడాపెడా బౌండరీలతో రెచ్చిపోవడంతో పవర్ ప్లేలో 53 పరుగులను లక్నో సాధించింది. అదే జోరులో 33 బంతుల్లో ఫిఫ్టీని సాధించిన మార్ష్.. తన జోరును ఇంకా కొనసాగించాడు. దీంతో ఓవర్ కు పది పరుగుల రన్ రేట్ తో ఆడిన లక్నో.. 10.3 ఓవర్లలోనే సెంచరీ పరుగులను సాధించింది. జోరుగా సాగుతున్న ఈ జోడీని సాయి కిశోర్ విడదీశాడు. మార్క్రమ్ ను ఔట్ చేయడంతో ఈ పార్ట్ నర్ షిప్ విడిపోయింది. ఆ తర్వాత నికోలస్ పూరన్ (27 బంతుల్లో 56 నాటౌట్, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసక ఫిఫ్టీతో రెచ్చిపోయాడు. మరో ఎండ్ లో తన జోరును కొనసాగించిన మార్ష్.. 56 బంతుల్లో ఫిఫ్టీ చేసుకుని ఔటయ్యాడు. దీంతో ఈ లీగ్ లో సెంచరీలు చేసిన అన్నదమ్ములుగా షాన్, మిషెల్ మార్ష్ నిలిచారు. ఇక రెండో వికెట్ కు పూరన్-మార్ష్ జోడీ121 పరుగుల జోడించడంతో లక్నో భారీ స్కోరు సాధించింది. చివర్లో కెప్టెన్ రిషభ్ పంత్ ఫినిషింగ్ టచ్ (6 బంతుల్లో 16 నాటౌట్, 2 సిక్సర్లు) ఇవ్వడంతో లక్నో స్కోరు 235 పరుగులకు చేరింది.
ఓపెనర్ల వైఫల్యం..భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ కు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఈ సీజన్లో జట్టుకు భారీ స్కోర్లు అందించిన త్రయం.. సాయి సుదర్శన్ (21), కెప్టెన్ శుభమాన్ గిల్ (35), జోస్ బట్లర్ (33) తమకు లభించిన ఆరంభాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. దీంతో పరుగుల ఛేజింగ్ లో గుజరాత్ వెనుకబడింది. దీంతో 96 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో షారూఖ్-షేర్ఫేన్ రూథర్ ఫర్డ్ (38) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరిద్దరూ భారీ షాట్లతో అలరించి, టార్గెట్ ను కరిగించుకుంటూ వచ్చారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంత వరకు గుజరాత్ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. అయితే రూథర్ ఫర్డ్ వెనుదిరిగాక, జీటీ వికెట్లను టపటపా కోల్పోయింది. ఆఖర్లో 22 బంతుల్లో ఫిఫ్టీ చేసిన షారూఖ్ ఔటవడంతో గుజరాత్ కు ఓటమి ఖరారైంది. మిగతా బౌలర్లలో అవేశ్ ఖాన్, ఆయూష్ బదోనీలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఈ ఫలితంతో టాప్-2లో నిలిచి, క్వాలిఫయర్ 1కి అర్హత సాధించాలనే జీటీ ఆశలు ఆవిరయ్యాయి. లక్నోకు ఊరట విజయం దక్కింది.