IPL 2025 LSG Superb Victory: లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో 4 పరుగుల స్వల్ప తేడాతో ఆతిథ్య కోల్ కతా నైట్ రైడర్స్ పై విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసక ఫిఫ్టీ (36 బంతుల్లో 87 నాటౌట్, 7 ఫోర్లు, 8 సిక్సర్లు)తో సిక్సర్ల జోరు చూపించాడు. బౌలర్లలో హర్షిత్ రాణాకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన కోల్ కతా 7 వికెట్లకు 234 పరుగులు చేసి ఓడిపోయింది. అజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ (35 బంతుల్లో 61, 8 ఫోర్లు, 2 సిక్సర్లు)తో స్టన్నింగ్ ఫిఫ్టీ చేశాడు. బౌలర్లలో లార్డ్ శార్దూల్ ఠాకూర్ కు రెండు వికెట్లు దక్కాయి.
మార్ష్ వీరంగం..ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నోకు సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ మిషెల్ మార్ష్ (48 బంతుల్లో 81, 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో అద్భుత ఆరంభాన్ని అందించాడు. మరో ఎండ్ లో మరో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (28 బంతుల్లో 47, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కాస్త వేగంగా ఆడాడు వీరిద్దరూ వేగంగా ఆడటంతో పవర్ ప్లేలో 59 పరుగులు వచ్చాయి. అనంతరం జోరు కొనసాగించడంతో తొలి వికెట్ కు 99 పరుగులు జతయ్యాయి. తర్వాత మార్క్రమ్ ఔౌటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన పూరన్.. మార్ష్ తో కలిసి వీర బాదుడు బాదాడు. ఈ క్రమంలో మార్ష్ 36 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుని, సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. దీంతో రెండో వికెట్ కి 71 పరుగులు జతయ్యాయి. ఆ తర్వాత పూరన్ ఒంటిచేత్తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. అబ్దుల్ సమద్ (6), డేవిడ్ మిల్లర్ (4 నాటౌట్ ) కూడా స్ట్రైక్ పూరన్ కే ఇవ్వడంతో తను ఆతిథ్య బౌలర్లను చితకబాదాడు. దీంతో 230+ పరుగులను లక్నో చేసింది.
పవర్ ప్లేలో 90 పరుగులు..భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్ కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (15), సునీల్ నరైన్ (30) వేగంగా ఆడే ప్రయత్నంలో త్వరగానే పెవిలియన్ కు చేరారు. దీంతో పవర్ ప్లేలో 90 పరుగులు నమోదయ్యాయి. ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్ (29 బంతుల్లో 45, 6 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి రహానే కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ పర్యాటక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని 40 బంతుల్లోనే 71 పరుగులు జత చేశారు. ఈ క్రమంలో 26 బంతుల్లోనే రహానే ఫిఫ్టీ కంప్లీట్ చేశాడు. అయితే స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో రహానే ఔటైన తరవాత కేకేఆర్ తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. రమణ్ దీప్ సింగ్ (1), అంగ్ క్రిష్ రఘువంశీ (5), అండ్రీ రసెల్ (7) విఫలమయ్యారు. రింకూ సింగ్ (15 బంతుల్లో 38 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి వరకు గెలిపించిఏ ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. మిగతా బౌలర్లలో ఆకాశ్ దీప్ కు రెండు వికెట్లు దక్కాయి. పూరన్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.