Lucknow Super Giants vs Mumbai Indians Eliminator: ఐపీఎల్‌ 2023 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ముందు ముంబై ఇండియన్స్ ఛాలెంజింగ్ మ్యాచ్ ఉంచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ (MI) 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో కామెరాన్ గ్రీన్ (41: 23 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. క్వాలిఫయర్ 2కి చేరుకోవాలంటే లక్నో 120 బంతుల్లో 183 పరుగులు చేయాల్సి ఉంది.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (11: 10 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), ఇషాన్ కిషన్ (15: 12 బంతుల్లో, మూడు ఫోర్లు) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో 38 పరుగులకే ముంబై ఇండియన్స్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కామెరాన్ గ్రీన్ (41: 23 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), సూర్యకుమార్ యాదవ్ (33: 20 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) ముంబైని ఆదుకున్నారు. వీరు మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరినీ ఒకే ఓవర్లో అవుట్ చేసి నవీన్ ఉల్ హక్ ముంబైని గట్టి దెబ్బ కొట్టాడు.


తిలక్ వర్మ (26: 22 బంతుల్లో, రెండు సిక్సర్లు), టిమ్ డేవిడ్ (13: 13 బంతుల్లో, ఒక ఫోర్) కాసేపు క్రీజులో నిలబడ్డారు కానీ వేగంగా ఆడలేకపోయారు. ఆఖర్లో నేహాల్ వధేరా (23: 12 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) చెలరేగి ఆడటంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ నాలుగు, యష్ ఠాకూర్ వికెట్లు పడగొట్టారు. మొహ్‌సిన్ ఖాన్‌కు ఒక వికెట్ దక్కింది.


లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
ఆయుష్ బడోని, దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా (కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్, మొహిసిన్ ఖాన్


లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
కైల్ మేయర్స్, డేనియల్ సామ్స్, యుధ్వీర్ సింగ్, స్వప్నిల్ సింగ్, అమిత్ మిశ్రా


ముంబై ఇండియన్స్ తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, క్రిస్ జోర్డాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆకాష్ మధ్వాల్


ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
రమణదీప్ సింగ్, విష్ణు వినోద్, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, సందీప్ వారియర్