Ravindra Jadeja Chennai Super Kings IPL 2023: ఐపీఎల్ 2023 మొదటి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 14 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. చెన్నై విజయంలో బౌలర్లు ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రమాదకరంగా బౌలింగ్ చేస్తూ రెండు వికెట్లు తీశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. జడేజా అద్భుత ఆటతీరుతో ‘మోస్ట్ వాల్యూబుల్ అసెట్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. దీనిపై ఆయన ఆసక్తికర ట్వీట్ చేశాడు. అభిమానులు కూడా ఈ ట్వీట్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు.
గుజరాత్‌పై విజయంతో చెన్నై ఫైనల్స్‌కు చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ విజయం తర్వాత, రవీంద్ర జడేజా అవార్డుతో ఉన్న ఫోటోను పంచుకున్నాడు. దాని క్యాప్షన్‌లో అభిమానుల గురించి ఆసక్తికర విషయాన్ని రాశాడు. ‘మోస్ట్ వాల్యూబుల్ అసెట్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్న అనంతరం కొంతమంది ఫ్యాన్స్‌కు తన విలువ తెలియట్లేదనే అర్థంలో ఈ ట్వీట్ చేశాడు. రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ధోని కోసం ఫ్యాన్స్ వెయిట్ చేయడం, తన వికెట్ పడాలని కోరుకోవడం జడ్డూ కోపానికి కారణం కావచ్చు.
రవీంద్ర జడేజా చేసిన ఈ ట్వీట్ తర్వాత సోషల్ మీడియాలో చాలా రకాల రియాక్షన్స్ కనిపించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాలని కొందరు అభిమానులు జడేజాకు సలహా ఇస్తున్నారు. జడేజా ట్వీట్ తర్వాత, 'కమ్ టు ఆర్‌సీబీ' అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో కొంతకాలం ట్రెండింగ్‌లో ఉంది.
ఐపీఎల్-16 లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ షాకిచ్చింది. స్వంత గ్రౌండ్ (చెపాక్)లో బ్యాటర్లు విఫలమైనా బౌలర్లు రాణించి ఆ జట్టును ఈ లీగ్‌లో పదోసారి ఫైనల్స్‌కు చేర్చారు. చెన్నై నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్.. ఓవర్లలో 157 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ధోనీ సేన.. 15 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్స్‌కు అర్హత సాధించింది. గుజరాత్ టీమ్‌లో శుభ్‌మన్ గిల్ (38 బంతుల్లో 42, 4 ఫోర్లు, 1 సిక్స్), ఆఖర్లో రషీద్ ఖాన్ (16 బంతుల్లో 30, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) భయపెట్టినా చెన్నై విజయాన్ని ఆపలేకపోయారు. ఈ విజయంతో ధోనీ సేన ఫైనల్‌కు చేరగా గుజరాత్ టైటాన్స్.. ముంబై - లక్నో మధ్య జరిగే మ్యాచ్ లో విజేతతో రెండో క్వాలిఫయర్ (మే 26) ఆడుతుంది.