Lucknow Super Giants vs Gujarat Titans: ఈ ఐపీఎల్‌లో ఇప్పటికే మనం గ్రేటెస్ట్ ఫినిష్ చూశాం. ఐదు బంతుల్లో 28 పరుగులు కావాల్సిన దశలో రింకూ సింగ్ ఐదు సిక్సర్లతో గెలిపించడం చూశాం. కానీ శనివారం సాయంత్రం మ్యాచ్‌లో లక్నో ఈ సీజన్‌లోనే అతి పెద్ద చోక్ చేసింది. లక్నో విజయానికి చివరి 36 బంతుల్లో 31 పరుగులు కావాలి. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి. క్రీజులు సెట్ అయిన బ్యాటర్లు కేఎల్ రాహుల్ (68: 61 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), కృనాల్ పాండ్యా (23: 23 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) ఉన్నారు. కానీ చివరికి ఏడు పరుగులతో లక్నో ఓడిపోయింది. 36 బంతుల్లో కేవలం 24 పరుగులు మాత్రమే చేసి ఆరు వికెట్లను కోల్పోయింది. వీటిలో నాలుగు వికెట్లు చివరి ఓవర్లలో పడ్డాయి.


ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (66: 50 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. వృద్ధి మాన్ సాహా (47: 37 బంతుల్లో, ఆరు ఫోర్లు) తనకు చక్కటి సహకారం అందించాడు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్‌లు రెండేసి వికెట్లు తీసుకున్నారు. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (68: 61 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) చివరి వరకు క్రీజులో ఉన్నా గెలిపించలేకపోయాడు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ రెండేసి వికెట్లు తీశారు. చివరి ఓవర్లో ప్రెజర్‌ను హోల్డ్ చేసిన మోహిత్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.


కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఫాంలో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (0: 2 బంతుల్లో) రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన హార్దిక్ పాండ్యా (66: 50 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (47: 37 బంతుల్లో, ఆరు ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. ఈ దశలో కృనాల్ పాండ్యానే సాహాను అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.


ఆ తర్వాత వచ్చిన వారిలో ఎవరూ రాణించలేకపోయారు. ముఖ్యంగా పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు సహకరించడంతో ఒక దశలో పరుగులు రావడమే కష్టం అయిపోయింది. కానీ మెల్లగా ఇన్నింగ్స్ చివరికి వెళ్లే సరికి హార్దిక్ గేర్లు పెంచాడు. ముఖ్యంగా స్టార్ బౌలర్ రవి బిష్ణోయ్‌ని టార్గెట్ చేసుకుని సిక్సర్లతో చెలరేగాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (6 నాటౌట్: 12 బంతుల్లో) చివరి వరకు క్రీజులో ఉన్నా ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడంటే అర్థం చేసుకోవచ్చు పిచ్ ఎంత టఫ్‌గా ఉందో. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రాలు చెరో వికెట్ పడగొట్టారు.