IPL 2025 LSG Hattrick Losses: లక్నో సూపర్ జెయింట్స్ పరాజయాల పరంపరం కొనసాగుతోంది. వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయి, పరాజయాల హ్యాట్రిక్ నమోదు చేసింది. ఆదివారం డబుల్ హెడర్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 37 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ అంచనాలకు తగినట్లుగా రాణించలేకపోయాడు. 237 పరుగుల టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నోకు శుభారంభం దక్కలేదు. 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా భారీ ఛేదనలో లక్నోను ఆదుకోవడంలో పంత్ విఫలమయ్యాడు. కేవలం 17 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. అతను ఔటైన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతారాహిత్యంగా ఆడి, వికెట్ పారేసుకున్నాడు. ఈ సందర్భంగా జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా హావభావాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనిపై తమకు తోచిన కామెంట్లు చేస్తూ, లైకులు, షేర్లతో హోరెత్తిస్తున్నారు.
సీజన్ లో పూర్ ఫామ్.. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ కు నాయకత్వం వహించిన పంత్.. ఈ ఏడాది నుంచి లక్నోకు సారథ్యం వహిస్తున్నాడు. రూ.27 కోట్ల భారీ ధరకు అతడిని కొనుగోలు చేసిన లక్నో యాజమాన్యం.. పంత్ ఆటతీరుపై నిరాశ జనకంగా ఉంది. ఈ సీజన్ లో 11 మ్యాచ్ లాడిన పంత్.. 10 ఇన్నింగ్స్ ల్లో బరిలోకి దిగాడు. ఇందులో కేవలం 128 పరుగులు చేసి నిరాశ పర్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై మాత్రం 63 పరుగులతో రాణించాడు. ఈ సీజన్ లో కేవలం 12 సగటు, వందలోపు స్ట్రైక్ రేట్ తో నిరాశపర్చాడు. కీలకమైన పంజాబ్ తో మ్యాచ్ లోనూ విఫలమయ్యాడు.
అన్ని రంగాల్లో విఫలం.. ధర్మశాలలో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో అన్ని రంగాల్లో విఫలమైంది. ఫస్ట్ బౌలర్లు తేలిపోవడంతో 236 పరుగులను లక్నో సమర్పించుకుంది. సరైన లైన్ అండ్ లెంగ్త్ లేకపోవడంతోపాటు గాడి తప్పిన బౌలింగ్ ను పంజాబ్ బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. ఇక బ్యాటింగ్ లో టాపార్డర్ ఘోరంగా విఫలమవడం జట్టు అవకాశాలను దెబ్బ తీసింది. పంత్ కూడా నిర్లక్ష్యంగా ఆడటంతో జట్టుకు ఓటమి తప్పలేదు. ఇక పేలవమైన ఫీల్డింగ్ తో పలు క్యాచ్ లను జారవిడవడం కూడా లక్నోకు శాపంగా మారింది. ఇక ఈ సీజన్ లో మిగిలిన మూడు మ్యాచ్ ల్లోనూ గెలిస్తే తప్ప, లక్నో ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశం లేదు. తన చివరి మూడు మ్యాచ్ లను ఆర్సీబీ, జీటీ, సన్ రైజర్స్ హైదరాబాద్ లతో లక్నో ఆడనుంది. ప్రస్తుతం 10 పాయింట్లతో లక్నో సూపర్ జెయింట్స్ ఏడో స్థానంలో ఉంది.