IPL 2025 PBKS Climbs Top-2 In Poinst Table: పంజాబ్ కింగ్స్ జోరు కొన‌సాగుతోంది. 7వ విజ‌యంతో ప్లే ఆఫ్స్ బెర్తుకి మ‌రో అడుగు ముందుకు వేసింది. ధ‌ర్మ‌శాల‌లో ఆదివారం జ‌రిగిన మ్యాచ్ లో 37 ప‌రుగుల‌తో ఘ‌న‌విజ‌యం సాధించింది. దీంతో 15 పాయింట్ల‌తో టాప్-2కి చేరుకుంది.  టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 236 ప‌రుగులు చేసింది. ఓపెన్ ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ ఫ్యాబ్యుల‌స్ ఫిఫ్టీ (48 బంతుల్లో 91, 6 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) తో త్రుటిలో సెంచ‌రీని మిస్ చేసుకున్నాడు. బౌల‌ర్లో ఆకాశ్ సింగ్ రెండు వికెట్లు తీసి, పోదుపుగా బౌలింగ్ చేశాడు. అనంత‌రం ఛేద‌న‌లో ఓవ‌ర్ల‌న్నీ ఆడిన ల‌క్నో 7 వికెట్ల‌కు 199 ప‌రుగులు చేసింది. ఆయుష్ బ‌దోనీ (40 బంతుల్లో 74, 5 ఫోర్లు, 5సిక్స‌ర్లు) టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్ సింగ్ కు మూడు వికెట్లు ద‌క్కాయి. 

ప్ర‌భ్ సిమ్రాన్ వీరంగం.. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. ఓపెన‌ర్ ప్రియాంశ్ ఆర్య (1) వికెట్ ను కోల్పోయింది. ఈ ద‌శ‌లో జోష్ ఇంగ్లీస్ (30) తో క‌లిసి ప్ర‌భ్ సిమ్రాన్ కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. ఇరువురు పోటాపోటీగా ప‌రుగులు సాధించ‌డంతో స్కోరు బోర్డు వేగంగా ప‌రుగులెత్తింది. ఈక్ర‌మంలో వీరిద్ద‌రూ రెండో వికెట్ కు 48 ప‌రుగులు జోడించి మంచి పునాది వేశారు. ఆ త‌ర్వాత శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (25 బంతుల్లో 45, 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) తో వేగంగా ఆడాడు. మ‌రో ఎండ్ లో ప్ర‌భ్ సిమ్రాన్ నిల‌క‌డ‌గా ఆడాడు. మూడో వికెట్ కు ప్ర‌భ్ సిమ్రాన్ తో 78 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యం నెల‌కొల్పిన త‌ర్వాత శ్రేయ‌స్ ఔట్ అయ్యాడు. అనంత‌రం 30 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ప్ర‌బ్ సిమ్రాన్.. గేర్ మార్చి, బౌండ‌రీలు బాది, శ‌త‌కానికి ద‌గ్గ‌ర‌లో ఔట‌య్యాడు.. మ‌రో ఎండ్ లో నేహాల్ వ‌ధేరా (16), శశాంక్ సింగ్ (33 నాటౌట్), మార్క‌స్ స్టొయినిస్ (15 నాటౌట్) ఫినిషింగ్ ట‌చ్ ఇవ్వ‌డంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. 

బ్యాటింగ్ వైఫ‌ల్యం.. భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ల‌క్నోకు అదిరే ఆరంభం ద‌క్క‌లేదు. బిగ్ టార్గెట్ ను చూసి బ్యాట‌ర్లు త్వ‌ర‌త్వ‌ర‌గా ఔట‌య్యారు. ఐడెన్ మార్క్ర‌మ్ (13), మిషెల్ మార్ష డ‌కౌట్, నికోల‌స్ పూర‌న్ (6), కెప్టెన్ రిష‌భ్ పంత్ (18), డేవిడ్ మిల్ల‌ర్ (11) విఫ‌లం అవ‌డంతో 73 ప‌రుగుల‌కే స‌గం వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో అబ్దుల్ స‌మ‌ద్ (24 బంతుల్లో 45, 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) తో క‌లిసి బ‌దోనీ కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. వీరిద్ద‌రూ వేగంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ, భారీగా బౌండ‌రీలు బాదుతూ స్కోరు బోర్డును ప‌రుగెత్తించారు. ఈ క్ర‌మంలో ఆరో వికెట్ కు 81 ప‌రుగుల విలువైన భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. అయితే కీల‌క ద‌శ‌లో స‌మ‌ద్ ఔట‌వ‌డంతో ల‌క్నోకు ఓట‌మి త‌ప్ప‌లేదు. 32 బంతుల్లో ఫిఫ్టీ చేసిన బ‌దోనీ చివ‌రికంటా నిలిచి పోరాడినా అది సరిపోలేదు. మిగతా బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్ జాయ్ కు రెండు వికెట్లు దక్కాయి.  ఈ విజ‌యంతో 15 పాయింట్ల‌తో టాప్-2కి పంజాబ్ చేరుకుంది. ఇక మ‌రో ప‌రాజ‌యంతో ప్లే ఆఫ్స్ అవ‌కాశాల‌ను క్లిష్టం చేసుకుంది. మిగ‌తా మూడు మ్యాచ్ ల్లో విజ‌యం సాధిస్తేనే ఆ జ‌ట్టు నాకౌట్ కు అర్హ‌త సాధిస్తుంది.