KKR vs SRH IPL Final 2024 : ఐపీఎల్(IPL)లో రహేల్ తుపాను కాస్త విరామం ఇచ్చిన వేళ టాస్ గెలిచిన హైదరాబాద్(SRH) తమకు బాగా అచ్చొచ్చిన బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ ఫైనల్ చేరేందుకు అత్యంత కీలక భూమిక పోషించిన హైదరాబాద్ ఓపెనర్లు మరోసారి విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. చెపాక్ మైదానంలో ఇక కోల్‌కత్తా బౌలర్లను ఊచకోత కోసేందుకు కాటేరమ్మ కొడుకులు సిద్ధమయ్యారు. బంతి బంతికి బౌండరీల మోత మోగించేందుకు హైదరాబాద్ బ్యాటర్లు సిద్ధమైపోయారు.
చెన్నై పిచ్ బౌలర్లకు అనుకూలిస్తున్న వేళ సన్‌రైజర్స్ ఆది నుంచే విధ్వంసం సృష్టిస్తుందా లేదా ఓపిగ్గా ఆడి చివర్లో చెలరేగిపోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సునీల్ నరైన్ బౌలింగ్‌ను హైదరాబాద్ బ్యాటర్లు ఎలా ఆడతారన్నది ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో కాస్త తడబడ్డ హైదరాబాద్ బ్యాటర్లు...ఈసారి ఆధిపత్యం చెలాయించేందుకు కావాల్సిన వ్యూహాలు రచించారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, గుర్బాజ్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వరుణ్ అరోరా.
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్‌రామ్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, ఉనద్కత్, నటరాజన్.
వీరి పోరాటం చూడాల్సిందే
హైదరాబాద్ బ్యాటర్లు తగ్గరు... కోల్‌కత్తా బౌలర్లు వదలరు ఇలా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆది నుంచి విధ్వంసమే ఆయుధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి బ్యాట్‌లు ఝుళిపిస్తే కోల్‌కత్తా బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయంగానే కనిపిస్తుంది. హైదరాబాద్ బ్యాటర్లలో ఏ ఇద్దరు నిలబడ్డా మ్యాచ్ స్వరూపం మారిపోవడం ఖాయమే. అలా అని కోల్‌కత్తాను తక్కువ అంచనా వేస్తే అసలుకే ఎసరు వస్తుంది. అందుకే హైదరాబాద్ జట్టు ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగాల్సి ఉంది. సారధి ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీనే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు కీలకంగా మారనుంది.
ఇప్పటికే ఆస్ట్రేలియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు... కప్పులు అందించిన కమిన్స్ మరోసారి తన మార్క్ కెప్టెన్సీతో సత్తా చాటితే ఐపీఎల్ కప్పు వచ్చి హైదరాబాద్ వడిలో పడడం ఖాయమే. మరోవైపు కోల్‌కత్తా కూడా అదే ఊపులో ఉంది. కోల్‌కత్తాలో ఓపెనర్ సునీల్ నరైన్‌తో హైదరాబాద్ బౌలర్లకు అసలు కష్టాలు ఉండనున్నాయి. ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న నరైన్... భారీ శతకం బాది మంచి ఊపులో ఉన్నాడు. ఫైనల్లోనూ సత్తా చాటి కోల్‌కత్తాకు మూడోసారి కప్పు అందించాలని నరైన్ పట్టుదలతో ఉన్నాడు.
గంభీర్‌తో మాములుగా ఉండదు
గత ఐపీఎల్ సీజన్‌లలో వరుసగా సతమతమవుతున్న కోల్‌కత్తా నైట్ రైడర్స్‌ను ఒక గాడిలో పెట్టిన ఘనత మాత్రం కచ్చితంగా గౌతం గంభీర్‌దే. పక్కా వ్యూహాలు, ప్రత్యర్థి జట్లను తికమక పెట్టే ప్రణాళికలు... ఆటగాళ్లలో ఆత్మ విశ్వాసాన్ని నింపడం... మైదానంలో దూకుడుగా వ్యవహరించడం వంటి అన్ని అంశాల్లోనూ కోల్‌కత్తా జట్టులో స్ఫూర్తిని నింపింది మాత్రం కచ్చితంగా గంభీరే. తన అపార అనుభవంతో.. మైదానంలో గడిపిన ఉత్కంఠ క్షణాలతో ఎంతో నేర్చుకున్న గంభీర్... ఇప్పుడు దానినే కోల్‌కత్తా జట్టు సభ్యులకు నేర్పాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టు ఇప్పుడు భీకరంగా కనిపిస్తుందంటే దానికి కారణం మాత్రం కచ్చితంగా గంభీరే. ఇక సమరం మొదలైంది. ఈ ఐపీఎల్ 17వ సీజన్ టైటిల్... ఎవరి పరం అవుతుందో... ఎవరి లెక్కలు తేలుతాయో.. ఎవరి అంచనాలు నిజమవుతాయో చూడాలి.