IPL 2024 Prize Money Telugu News: ఐపీఎల్ 2024 చివరి అంకానికి చేరుగుంది. మారికాసేపట్లో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్- కోల్కతా నైట్ రైడర్స్(SRH VS KKR) మధ్య తుదిపోరు జరుగనుంది. ఇప్పటికే.. ఈ రెండు జట్లు క్వాలిఫైయర్ -1లో ఒకదానితో ఒకటి తలపడ్డాయి. అయితే ఆ మ్యాచ్లో సన్ రైజర్స్పై గెలిచి కోల్కతా జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే.. ఎలిమినేటర్ మ్యాచ్లో నెగ్గిన రాజస్థాన్ రాయల్స్ పై క్వాలిఫయర్ 2లో అద్భుత విజయం సాధించి సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇరుజట్లకు విజయావకాశాలు సమానంగా ఉన్న ఈ ఫైనల్ లో ఎవరు గెలిస్తారు? గిలిస్తే ఎంత సంపాదిస్తారు, ఓడితే ఎంత తీసుకుంటారో ఒకసారి చూద్దాం..
ఐపీఎల్ 2024 మొత్తం ప్రైజ్ మనీ ఎంత..
ఐపిఎల్ లో జట్లు కప్పు గెలవడం వల్ల కప్పు టీం కి ఉండిపోతుంది గానీ డబ్బు మాత్రం ఆటగాళ్ళకే చెందుతుంది. అందుకే ప్రపంచంలోని ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నమెంట్‌లలో అత్యధిక ప్రైజ్ మనీని అందించేది ఐపిఎల్ మాత్రమే అని చెప్పవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ (IPL 2024) 17వ సీజన్‌కు బీసీసీఐ(bcci) 46.5 కోట్ల రూపాయలను ప్రైజ్ మనీగా కేటాయించింది.
విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్‌మనీ ఎంత ఇస్తారంటే..
ఇందులో విజేతలకు రూ.20 కోట్లు, రన్నరప్‌లకు రూ.13 కోట్లు చెల్లిస్తారు. అలాగే మూడు, 4వ స్థానాల్లో నిలిచిన జట్లు వరుసగా రూ.7 కోట్లు మరియు రూ.6.5 కోట్లు పొందుతాయి. జట్లతో పాటూ వ్యక్తిగతంగా ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలకు కూడా ఒక్కొక్కరికి రూ.15 లక్షల ప్రైజ్ మనీ దక్కనుంది. అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పొందిన వ్యక్తికి రూ. 20 లక్షలు అందజేస్తారు. అంతేకాదు ఆటగాళ్ళలో మరింత ఉత్సాహాన్ని పెంచడానికి సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడు, ఇంకా గేమ్ ఛేంజర్ గా నిలిచిన వ్యక్తికి ఒక్కొక్కరికి రూ. 12 లక్షలు అందజేస్తారు.
ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలు ఎవరంటే..
ఐపిఎల్ సీజన్ మొత్తానికి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌కు ఆరెంజ్ క్యాప్(Orang Cap) అందజేస్తారన్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో 15 మ్యాచ్‌ల్లో 741 పరుగులతో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆరెంజ్ క్యాప్ అందుకోనున్నాడు. అతను రూ. 15 లక్షల ప్రైజ్ మనీ అందుకుంటాడు. ఇక పంజాబ్ కింగ్స్‌కు చెందిన హర్షల్ పటేల్(Harshad Patel) 24 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్(Purple Cap)ను కాపాడుకున్నాడు. పటేల్‌కు కూడా రూ.15 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అందుతుంది.
2023 ఐపీఎల్ సీజన్ 16లో ధోనీ ఆధ్వర్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(CSK) విజేతగా నిలిచినప్పుడు ఆ జట్టు కూడా రూ.20 కోట్లు ప్రైజ్ మనీ అందుకుంది. అప్పటి రన్నరప్ గుజరాత్ టైటన్స్(GT) రూ. 13 కోట్లను సొంతం చేసుకుంది.
ఇక మొన్న 2024లో ఐపీఎల్ అమ్మాయిల ట్రోఫీని ఆర్సీబీ(RCB) సొంతం చేసుకున్న సమయంలో వీరికి ప్రైజ్ మనీగా రూ. 6 కోట్లు అందింది. రన్నరప్ గా నిలచిన ఢిల్లీ క్యాపిటల్స్(DC) కు రూ. 3 కోట్లు దక్కింది.