Sunrisers Hyderabad targer 209: సన్‌రైజర్స్‌(SRH) హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కత్తా(KKR) భారీ స్కోరు చేసింది. ఫిలిప్‌ సాల్ట్‌, అండ్రూ రస్సెల్‌ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో7  వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. కోల్‌కత్తా జట్టులో సునీల్ నరైన్‌, ఫిలిప్‌ సాల్ట్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగి పర్వాలేదనిపించే ఆరంభాన్ని ఇచ్చారు. భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్‌లో కేవలం మూడు పరుగులు వచ్చాయి.  రస్సెల్‌ 64 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.


సమఉజ్జీల సమరం...
అనంతరం ఫిలిప్‌ సాల్ట్‌ చెలరేగాడు. ఒకే ఓవర్లో మూడు సిక్సులు బాదేశాడు. మార్కో జాన్సెన్‌ వేసిన రెండో ఓవర్‌లో మూడు, నాలుగు, ఐదు బంతులను ఫిలిప్‌ సాల్ట్ స్టాండ్స్‌లోకి పంపాడు. చివరి బంతికి రెండు పరుగులు చేసిన సునీల్ నరైన్‌ రనౌట్‌ అయ్యాడు. దీంతో 23 పరుగుల వద్ద కోల్‌కత్తా తొలి వికెట్‌ కోల్పోయింది. ఓవైపు సాల్ట్‌ విరుచుకుపడుతున్నా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. తొలి ఓవర్‌లో మూడు పరుగులు ఇచ్చిన భువీ.. రెండో ఓవర్‌లో నాలుగు రన్స్‌ మాత్రమే ఇచ్చాడు. అనంతరం పేసర్ నటరాజన్‌... కోల్‌కతాకు గట్టి షాక్‌ ఇచ్చాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి కోల్‌కతాకు గట్టి షాక్‌ ఇచ్చాడు. 3.3 ఓవర్‌ బంతికి వెంకటేశ్ అయ్యర్‌ను అవుట్‌ చేసిన నటరాజన్‌... 3.5 ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్‌ను అవుట్ చేశాడు. అయ్యర్‌ కొట్టిన బంతిని మిడాఫ్‌లో కమిన్స్‌ గాల్లోకి ఎగిరి సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో 32 పరుగులకే కోల్‌కత్తా మూడు వికెట్లు కోల్పోయింది. పవర్‌ ప్లే ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 43/3. స్పిన్నర్‌ మయాంక్‌ మర్కండే వేసిన ఎనిమిదో ఓవర్‌లో మూడో బంతికి 9 పరుగులు చేసిన నితీష్ రాణా ఔటయ్యాడు. దీంతో కోల్‌కతా 8 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 53 పరుగులే చేసింది.


ఆదుకున్న సాల్ట్‌.. రమణదీప్‌
53 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన కోల్‌కత్తాను సాల్ట్‌, రమణదీప్‌ ఆదుకున్నారు. దూకుడుగా ఆడిన రమణ్‌దీప్‌ సింగ్ 17 బంతుల్లో 35 పరుగులు చేసి కమిన్స్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. తర్వాత వచ్చిన రింకు సింగ్ ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి పంపాడు. ఆ తర్వాత అర్ధ శతకం పూర్తి చేసుకున్న వెంటనే ఫిలిప్‌ సాల్ట్ అవుటయ్యాడు. 40 బంతుల్లో 54 పరుగులు చేసి ఫిలిప్‌ సాల్ట్ ఔటయ్యాడు.
అనంతరం ఆండ్రూ రస్సెల్ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మయాంక్‌ మర్కండే వేసిన 16 ఓవర్‌లో తొలి బంతికి డీప్‌ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్‌ కొట్టిన రస్సెల్‌.. నాలుగో బంతిని, ఐదో బంతిని కూడా స్టాండ్స్‌లోకి పంపాడు. ఇందులో ఒక సిక్స్‌ 102 మీటర్ల దూరం పోవడం విశేషం.