Lucknow Super Giants vs Kolkata Knight Riders: ఐపీఎల్‌ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన థ్రిల్లర్ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న లక్నో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆడనుంది. లక్నో సూపర్ జెయింట్స్ ప్రత్యర్థి ఎవరనేది రేపు క్లారిటీ వస్తుంది.


కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లలో రింకూ సింగ్ (67 నాటౌట్: 33 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) చివరి దాకా పోరాడాడు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, యష్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ (58: 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్‌తో అర్థ సెంచరీ సాధించాడు. కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఏకంగా ఎనిమిది బౌలింగ్ ఆప్షన్లను ట్రై చేసింది. శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా రెండేసి వికెట్లు తీసుకున్నారు.


రింకూ ఒక్కడే...
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు జేసన్ రాయ్ (45: 28 బంతుల్లొ, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్), వెంకటేష్ అయ్యర్ (24: 15 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్)  కేవలం 5.5 ఓవర్లలోనే మొదటి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. వీరిద్దరూ దాదాపు 160 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశారు. అక్కడి నుంచి వరుస విరామాల్లో వికెట్లు పడుతూనే ఉన్నాయి.


నితీష్ రాణా (8: 10 బంతుల్లో, ఒక ఫోర్), రహ్మనుల్లా గుర్బాజ్ (10: 15 బంతుల్లో), ఆండ్రీ రసెల్ (7: 9 బంతుల్లో, ఒక సిక్సర్), శార్దూల్ ఠాకూర్ (3: 7 బంతుల్లో), సునీల్ నరైన్ (1: 2 బంతుల్లో) దారుణంగా విఫలం అయ్యారు. కోల్‌కతా లక్ష్యానికి అంత దగ్గరికి వచ్చిందంటే కారణం రింకూ సింగే (67 నాటౌట్: 33 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు). ఇన్నింగ్స్ ఎక్కడా స్లో అవ్వకుండా ఆడాడు. కోల్‌కతా విజయానికి చివరి మూడు 18 పరుగులు అవసరం కాగా, రింకూ 16 పరుగులు లాగాడు. దీంతో కోల్‌కతా కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో కోల్‌కతా ఇంటి బాట పట్టింది.


అదరగొట్టిన పూరన్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే వారికి ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్ కరణ్ శర్మ (3: 5 బంతుల్లో) ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే అవుటయ్యాడు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ (28: 27 బంతుల్లో, రెండు సిక్సర్లు), వన్ డౌన్‌లో వచ్చిన ప్రేరక్ మన్కడ్ (26: 20 బంతుల్లో, ఐదు ఫోర్లు) రెండో వికెట్‌కు 41 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు.


అయితే ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్‌లను (0: 2 బంతుల్లో) ఒకే ఓవర్లో అవుట్ చేసి వైభవ్ అరోరా లక్నోకు షాక్ ఇచ్చాడు. కృనాల్ పాండ్యా (9: 8 బంతుల్లో, ఒక సిక్సర్), క్వింటన్ డి కాక్ కూడా కాసేపటికే అవుటయ్యారు. దీంతో లక్నో 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.


ఆ తర్వాత నికోలస్ పూరన్ (58: 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు), ఆయుష్ బదోని (25: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) లక్నోను ఆదుకున్నారు. వీరు ఆరో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ ఆఖర్లో వీరిద్దరూ స్వల్ప వ్యవధిలోనే అవుట్ అయినా ఆఖర్లో కృష్ణప్ప గౌతం (11 నాటౌట్: 4 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) వేగంగా పరుగులు చేశాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా రెండేసి వికెట్లు తీసుకున్నారు. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా చెరో వికెట్ పడగొట్టారు.