Delhi Capitals vs Chennai Super Kings: ఐపీఎల్‌ 2023 సీజన్ 67వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. దీంతో చెన్నై 77 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ టాప్ 2కి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. ఎందుకంటే ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న లక్నో రెండో స్థానానికి చేరాలంటే కోల్‌కతాను 97 పరుగులతో ఓడించాల్సి ఉంటుంది.


ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్‌లో కేవలం డేవిడ్ వార్నర్ (86: 58 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు) మాత్రమే రాణించాడు. ఇంకెవరూ అతనికి సహకారం అందించలేదు. ఇక చెన్నై విషయానికి వస్తే... చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే (87: 52 బంతుల్లో, 11 ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (79: 50 బంతుల్లో, మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లు) కూడా భారీ అర్థ సెంచరీ సాధించాడు.


కేవలం వార్నర్ మాత్రమే...
224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏ దిశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. కేవలం డేవిడ్ వార్నర్ (86: 58 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు) మాత్రమే రాణించారు. తన తర్వాత యష్ ధుల్ (13: 15 బంతుల్లో, ఒక ఫోర్), అక్షర్ పటేల్ (15: 8 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. చెన్నై బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ అస్సలు ఢిల్లీ బ్యాటర్లను నిలదొక్కుకోనివ్వలేదు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లు తీసుకున్నాడు. మహీష్ థీక్షణ, మతీష పతిరానా రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే చెరో వికెట్ దక్కించకున్నారు.


అదరగొట్టిన ఓపెనర్లు
టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నైకి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా చెన్నై సూపర్ కింగ్స్ 52 పరుగులు చేసింది.


ఆ తర్వాత ఈ జోడి గేర్లు మార్చింది. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్లతో చెలరేగాడు. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన రుతురాజ్ గైక్వాడ్, కుల్దీప్ యాదవ్ వేసిన 12వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదేశాడు. ఈలోపే అతని అర్థ శతకం కూడా పూర్తయింది. అతని తర్వాత డెవాన్ కాన్వే కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరి భాగస్వామ్యం కూడా 100 పరుగులు దాటింది.


ఈ సీజన్‌లో చెన్నైకి ఇది నాలుగో సెంచరీ ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్. మొదటి వికెట్‌కు 142 పరుగులు జోడించిన అనంతరం చేతన్ సకారియా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రుతురాజ్ గైక్వాడ్ అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే డెవాన్ కాన్వే కూడా అవుటయ్యాడు. చివర్లో శివం దూబే, రవీంద్ర జడేజా చెలరేగడంతో చెన్నై భారీ స్కోరు చేసింది.