IPL 2025 PBKS Tops Points Table and MI Will Play Eliminator: పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. కొత్ జట్టు, కొత్త కెప్టెన్సీ నాయకత్వంలో ఈ సీజన్ లో క్వాలిఫయర్ 1కి చేరిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. అన్ని రంగాల్లో అద్భుతంగా రాణించిన పంజాబ్.. ముంబైని 7 వికెట్లతో చిత్తుగా ఓడించింది. జైపూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ మరో అర్ధ సెంచరీ (39 బంతుల్లో 57, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో అర్షదీప్ సింగ్, మార్కో యన్సెన్, విజయ్ కుమార్ వైశాఖ్ కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ లో 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 187 పరుగులను చేసిన పంజాబ్ ఈజీ విక్టరీ సాధించింది. వన్ డౌన్ బ్యాటర్ జోష్ ఇంగ్లీస్ (42 బంతుల్లో 73, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత అర్ధ సెంచరీతో జట్టు తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. శాంట్నర్ కు రెండు వికెట్లు దక్కాయి.
సూపర్ ఫామ్..ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబైకి ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (27), రోహిత్ శర్మ (24) శుభరంభాన్నిచ్చారు. వీరిద్దరూ ఆచి తూచి ఆడి, తొలి వికెట్ కు 45 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన సూర్య.. వన్ మేన్ షో చూపించాడు. గత మ్యాచ్ లో అజేయ ఫిఫ్టీ చేసిన సూర్య.. ఈ మ్యాచ్ లో ఆ ఫామ్ ను కొనసాగించాడు. ముఖ్యంగా ఆరంభం నుంచే దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు వేగంగా సాగింది. కాసేపటికి రోహిత్ , తిలక్ వర్మ (1) ఔటైనా తన జోరు మాత్రం కొనసాగింది. దీంతో ముంబై తరపున ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా దిగ్గజం సచిన్ టెండూల్కర్ (618 రన్స్) పేరిట ఉన్న రికార్డును సూర్య తిరగరాశాడు. అదే జోరులో 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుని, ఔటయ్యాడు. చివర్లో హర్దిక్ పాండ్యా (26), నమన్ ధీర్ (20), విల్ జాక్స్ (17) వేగంగా ఆడటంతో ముంబై సవాలు విసరగలిగే స్కోరును సాధించింది.
ఇంగ్లీస్-ప్రియాంశ్ షో..ఓ మాదిరి ఛేజింగ్ తో బ్యాటింగ్ ను ప్రారంభించిన పంజాబ్ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. తనకు లభించిన లైఫ్ ను యూజ్ చేసుకోలేని ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ (13) త్వరగా ఔటయ్యాడు. ఈ దశలో మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (35 బంతుల్లో 62, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి ఇంగ్లీస్ చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. హిట్టింగ్ కోసం పంజాబ్ తనను ముందు పంపగా, ఆ పనిని ఇంగ్లీస్ చేసి చూపించాడు. మరో ఎండ్ లో ప్రియాంశ్ కూడా దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు వేగంగా సాగింది. ఇక ఇంగ్లీస్ మాత్రం.. వైవిధ్యమైన షాట్లతో ఎక్కువ శాతం ఒత్తిడినంతా తీసేశాడు. ఈ క్రమంలో 20 బంతుల్లో ఇంగ్లీస్, 27 బంతుల్లో ప్రియాంశ్ అర్థ సెంచరీలు సాధించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 109 పరుగులు జోడించడంతో పంజాబ్ దాదాపు విజయం ముంగిట నిలిచింది. ఆ తర్వాత ప్రియాంశ్ ఔటైనా.. ఇంగ్లీస్ కాసేపు దూకుడుగా ఆడి, ఔటయ్యాడు. చివర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ( 26 నాటౌట్), నేహాల్ వధేరా (2 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేసి, జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో క్వాలిఫయర్ 1కు చేరిన తొలి జట్టుగా పంజాబ్ ఘనత సాధించింది. మరో స్థానం కోసం ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ పోటీపడుతున్నాయి. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో గెలిస్తేనే క్వాలిఫయర్ 1కి ఆర్సీబీ అర్హత సాధిస్తుంది. మ్యాచ్ లో ఓడిపోయినా, రద్దయినా గుజరాత్ నేరుగా క్వాలిఫయర్ 1కు అర్హత సాధిస్తుంది. మెరుగైన రన్ రేట్ ఉండటమే జట్టుకు సానుకూలంశం కావడం విశేషం. తాజా ఫలితంతో ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ కు పరిమితమైంది.