ఆడిన ప్రతి జట్టుకూ న్యాయం చేసే క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)! ఒకప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata knightriders)కు కీలకంగా నిలిచాడు. ఇప్పుడు ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) మిడిలార్డర్‌కు ప్రాణం పోస్తున్నాడు. సంప్రదాయ క్రికెటింగ్ షాట్లే కాకుండా ఆధునిక షాట్లతో దుమ్మురేపుతాడు. ఎలాంటి బంతినైనా ఆకాశంలోకి పంపించే సూర్యను అభిమానులు, సహరులు 'SKY' అని పిలుస్తుంటారు. నిజానికి అతడికీ నిక్‌నేమ్ పెట్టింది గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అని చెబుతున్నాడు.
బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ అనే యూట్యూబ్ షోలో సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికరమైన సంగతులు చెప్పాడు. '2014లో నేను కేకేఆర్‌కు వెళ్లినప్పుడు గౌతీ భాయ్ నా వెనక నుంచి SKY అని రెండు మూడు సార్లు పిలిచాడు. కానీ నేను పట్టించుకోలేదు. నేను నిన్నే పిలుస్తున్నాను. నీ ఇనిషియల్స్ చూసుకో అని చెప్పాడు. అప్పుడే నాకర్థమైంది SKY అంటే నాపేరేనని' అని సూర్య వివరించాడు.
ముంబయి ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో సచిన్ తెందూల్కర్ తన పక్కన కూర్చోమన్న సంగతినీ సూర్య చెప్పాడు. 'తొలిసారి నేను ముంబయి ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లినప్పుడు నేను కూర్చోవడానికి స్థలం లేదు. కిట్‌బ్యాగ్‌తో నేనలాగే నిలబడ్డాను. తెందూల్కర్ సాధారణంగా వినాయకుడి విగ్రహం పక్కన కూర్చుంటారు. ఆయనే నన్ను తన పక్కన కూర్చోమన్నారు. అప్పటి నుంచి నేను అక్కడే కూర్చుకుంటున్నాను. దేవుడే తన పక్కన కూర్చోమన్నాడంటే మనప్పుడూ ఆ ఆజ్ఞను పాటించాల్సిందే' అని పేర్కొన్నాడు.
సూర్యకుమార్ ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 119 మ్యాచులు ఆడాడు. 30.25 సగటుతో 2541 పరుగులు చేశాడు. అందులో 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముంబయిలోనే పుట్టి పెరిగిన సూర్య ఐపీఎల్‌లో అరంగేట్రం చేసింది ముంబయి ఇండియన్స్ తరఫునే. అయితే 2012లో కోల్‌కతాకు వెళ్లాకే అతడిలోనే కసి, క్రికెట్ గురించి అందరికీ తెలిసింది.