త్వరలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ జరగబోతోంది. ప్రస్తుతం ఆ మ్యాచ్ లకు ప్రిపేర్ అవుతున్నానని చెబుతున్నాడు ఐపీఎల్ క్రికెటర్ అశ్విన్ హెబ్బార్. ఐపీఎల్-2022లో  ఢిల్లీ క్యాపిటల్స్ కి ప్రాతినిధ్యం వహించిన హెబ్బార్, రెండేళ్లలో టీమిండియాకి సెలక్ట్ కావడం తన లక్ష్యం అని చెబుతున్నాడు. సక్సెస్ కి షార్ట్ కట్స్ లేవని, ప్రతి ఒక్కరూ కష్టపడి తమ తమ రంగాల్లో రాణించాలని చెబుతున్నాడు. తాను కూడా నెల్లూరు ఏసీ స్టేడియంలో క్రికెట్ ఆడుతూ, చిన్నప్పటి నుంచి క్రికెట్ నే ధ్యాసగా పెట్టుకున్నానని, అందుకే సక్సెస్ కాగలిగానని అంటున్నాడు. 




ఈ ఏడాది ఐపీఎల్ కి ఏపీ నుంచి ఇద్దరే ఇద్దరు సెలక్ట్ అయ్యారు. ఒకరు శ్రీకర్ భరత్ కాగా, ఇంకొకరు అశ్విన్ హెబ్బార్. ఐపీఎల్ హడావిడి ముగిసిపోయిన తర్వాత నెల్లూరు కుర్రాడు అశ్విన్ హెబ్బార్ సొంత ఊరికి వచ్చాడు. స్థానిక క్రికెట్ క్రీడాకారులు, ఆయనను ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా తాను చిన్నప్పుడు ఆడిన గ్రౌండ్ ని ఓసారి సందర్శించారు అశ్విన్ హెబ్బార్. ఐపీఎల్ అనేది ఓ అద్భుత అవకాశమని, యువ క్రికెకటర్లకు ఇదో ఓ అద్భుత ప్లాట్ ఫామ్ అంటున్నారు అశ్విన్. ఇక టీ-20 అనేది ఓ ఛాలెంజింగ్ ప్లాట్ ఫామ్ అని, బాల్ -1 నుంచి బాల్ -120 వరకు రకరకాలుగా మ్యాచ్ మారిపోతుందని అంటున్నారు.




సయ్యద్ ముస్టాక్ అలీ టోర్నమెంట్ లో తాను చూపిన ప్రతిభ తనను ఐపీఎల్ కి ఎంపిక చేసిందని చెబుతున్నారు అశ్విన్ హెబ్బార్. ముస్టార్ అలీ టోర్నమెంట్ లో సెంచరీ సాధించాడు అశ్విన్. ఐపీఎల్ లోని 8 ఫ్రాంచైజీల దగ్గరకు తాను ట్రయల్స్ కి వెళ్లానని, చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ కి సెలక్ట్ అయ్యాయనని అంటున్నారు. ప్రస్తుతం ఆఫ్ సీజన్ ట్రైనింగ్ కి సిద్ధమవుతున్నట్టు చెప్పారు అశ్విన్. 


1995 నవంబర్ 15న నెల్లూరులో జన్మించాడు అశ్విన్ హెబ్బార్. తండ్రి రాజ్ గిరి హెబ్బార్, తల్లి నళిని హెబ్బార్. వీరిద్దరూ అశ్విన్ ప్రతిభను చిన్న తనంలోనే గుర్తించి అతడికి క్రికెట్ లో శిక్షణ ఇప్పించారు. అశ్విన్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్ మన్, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ కూడా. కానీ బ్యాట్స్ మన్ గానే అశ్విన్ తన సత్తా చాటాడు. 2015లో త్రిపుర వర్సెస్ ఆంధ్రా టీమ్ మధ్య జరిగిన మ్యాచ్ తో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అశ్విన్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతను చెలరేగిపోయాడు. బ్యాట్స్ మన్ గా సత్తా చూపుతూనే బౌలర్ గా కూడా రాణిస్తున్నాడు అశ్విన్. 2007లో అండర్ -13 జిల్లా జట్టుకి ఎంపికైన అశ్విన్.. 2022 నాటికి ఐపీఎల్ కి ఎదిగాడు. మరో రెండేళ్లలో టీమిండియాకు ఆడతానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 


సక్సెస్ కి షార్ట్ కట్స్ లేవని చెప్పే అశ్విన్.. చిన్నప్పటి నుంచి తన టాలెంట్ నే నమ్ముకున్నాడు. ప్రస్తుతం ఉత్తరాది నుంచి ఎక్కువ కాంపిటీషన్ ఉందని, దాన్ని దాటుకుని వెళ్లాలంటే ఏపీ ప్లేయర్స్ మరింత కష్టపడాలని చెబుతున్నాడు. నెల్లూరులోని యువ క్రికెట్ ప్లేయర్స్ కి అశ్విన్ ఆదర్శంగా నిలిచాడు.