ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 72 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అత్యంత ఖరీదైనదిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు స్టార్క్‌ను కొనుగోలు చేసింది. పాట్ కమిన్స్ రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 20.50 కోట్లకు కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా హర్షల్ పటేల్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. యూపీ తరఫున ఆడిన సమీర్ రిజ్వీ అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్. సమీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 8.40 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ వేలంలో భారీ ధర దక్కించుకుంటారనుకున్న అంచనాలు తప్పాయి. దిగ్గజ ఆటగాళ్లకు ఈసారి జరిగిన మినీ వేలంలో నిరాశే ఎదురైంది. అమ్ముడుపోని టాప్‌- 10 ఆటగాళ్లను  ఓసారి పరిశీలిస్తే. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఐపీఎల్‌ మినీ వేలంలో అమ్ముడుపోలేదు. స్మిత్‌ను దక్కించుకునేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు. 



స్మిత్‌తో పాటు జోష్ ఇంగ్లిస్, ఆదిల్ రషీద్, వాండర్ డసెన్‌, జేమ్స్ విన్స్, సీన్ అబాట్‌, జేమీ ఓవర్టన్, బెన్ డకెట, ఫిలిప్ సాల్ట్, జోష్‌ హేజిల్ వుడ్ అమ్ముడు పోలేదు.
 భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో నాకౌట్‌ చేరిన జట్లలోని ఆటగాళ్లపై ఐపీఎల్‌ వేలంలో కనక వర్షం కురిసింది. అందరూ అంచనా వేసినట్లే ఆస్ట్రేలియా క్రికెటర్లకు భారీ ధర పలికింది. న్యూజిలాండ్‌ ఆటగాళ్లకు కూడా భారీ ధర పలికింది. భారత్‌ను ఫైనల్లో ఓడించి ఆరోసారి ప్రపంచకప్‌ను గెలిచిన ఆటగాళ్లకు కనివినీ ఎరుగని ధర పలికింది. కంగారులు ప్రపంచకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన మిచెల్‌ స్టార్క్‌... ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మినీ వేలంలో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరను సొంతం చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రూ. 24.75 కోట్లకు దక్కించుకుంది. గుజరాత్‌ టైటాన్స్‌, కోల్‌కతా చివరి వరకు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆ తర్వాత ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ రూ. 20.5 కోట్లు దక్కించుకుని రెండో స్థానంలో నిలిచాడు. అతడిని సన్‌రైజర్స్‌ హైదరాబాద్ సొంతం చేసుకుంది.


వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను సెమీస్‌కు చేర్చిన ఆల్‌రౌండర్‌ డారిల్‌ మిచెల్‌ను రూ. 14 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్‌ సొంతం చేసుకుంది. అంచనాలకు తగ్గట్టుగానే నేటి ఐపీఎల్ వేలంలో డారిల్ మిచెల్ కు భారీ ధర పలికింది. చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. ఎందుకంటే డారిల్ మిచెల్ కనీస ధర రూ.1 కోటి మాత్రమే అయితే పలు ఫ్రాంచైజీలు వేలం పాటను అమాంతం పెంచేశాయి. అయితే తొలి దశలో వ్యూహాత్మకంగా మౌనంగా ఉండిపోయిన చెన్నై రూ.11 కోట్ల పాట వద్ద ఎంటరైన చెన్నై రూ.14 కోట్లతో అతడిని సొంతం చేసుకుంది. ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన కుర్ర హీరో రచిన్‌ రవీంద్రను కూడా 1.8 కోట్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ దక్కించుకుంది.