Shubham Dubey : ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో దేశవాళీ పోటీల్లో సత్తా చాటిన అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ శుభమ్‌ దూబేపై రాజస్థాన్‌ కాసుల కాసుల వర్షం కురిపించింది. బేస్‌ ధర కంటే 20 రెట్లు ఎక్కువ మొత్తానికి శుభమ్‌ దూబేను రాజస్థాన్ రాయల్స్‌ సొతం చేసుకుంది. బేస్ ధర రూ.20 లక్షలతో వేలంలోకి వచ్చిన శుభమ్‌ను రూ.5.80 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది.  శుభమ్‌ దూబేను దక్కించుకునేందుకు  ఢిల్లీ క్యాపిటల్స్... రాజస్థాన్‌ రాయల్స్‌ తీవ్రంగా ప్రయత్నించాయి. చివర్లో ఢిల్లీ రూ.5.60 కోట్ల బిడ్ దాఖలు చేయగా.. రాజస్థాన్‌ రూ. 5.80 కోట్లకు బిడ్‌ దాఖలు చేసి శుభమ్‌ను వేలంలో భారీ ధర పలికిన తర్వాత శుభమ్ దూబే ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజస్థాన్ రాయల్స్ కూడా శుభమ్ ఫోటోను షేర్ చేసింది.


శుభమ్ దూబే దేశవాళీ మ్యాచ్‌ల్లో విధ్వంసక ర ఆటగాడిగా గుర్తింపు పొందాడు. శుభమ్‌ సునాయసంగా భారీ షాట్లు ఆడతాడు. ఈ ఏడాదే శుభమ్ దూబే లిస్ట్ ఏ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2023నవంబర్‌లో మేఘాలయ జరిగిన మ్యాచ్‌లో విదర్భ తరపున శుభమ్‌ తన మొదటి మ్యాచ్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దూబే విధ్వంస బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఏడు ఇన్నింగ్స్‌లలో 187.28 స్ట్రైక్ రేట్‌తో 221 పరుగులు చేశాడు. బెంగాల్‌పై జరిగిన మ్యాచ్‌లో విదర్భను ఒంటిచేత్తో గెలిపించాడు. 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 20 బంతుల్లో అజేయంగా 58 పరుగులు చేసి 13 బంతులు మిగిలి ఉండగానే విదర్భను గెలిపించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. 


మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ సమీర్‌ రిజ్వీపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ కాసుల వర్షం కురిపించింది. రూ. 20 లక్షలతో వేలంలోకి వచ్చిన రిజ్వీని రూ.8.4 కోట్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ దక్కించుకుంది. సమీర్‌ కోసం గుజరాత్‌, చెన్నై పోటాపోటీగా వేలంలో పాల్గొన్నాయి. కానీ చివరకు సమీర్‌ను భారీ ధరకు చెన్నై సూపర్‌ కింగ్స్ దక్కించుకుంది. 


ఐపీఎల్ వేలం అనగానే అందరికి గుర్తొచ్చేది.. విదేశీ క్రికెటర్లు. అంతర్జాతీయ అనుభవం, అత్యుత్తమ గణాంకాలు ఉన్న వారి కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈసారి వేలంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సమీర్ రిజ్వీ సత్తా చాటాడు. ఉత్తర్ ప్రదేశ్, మీరట్ కు చెందిన 20 ఏళ్ల సమీర్‌ రిజ్వీ.. రైట్ ఆర్మ్ బ్యాట్స్‌మెన్‌తో పాటు మంచి ఆఫ్ స్పిన్నర్. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ రాణించగల సమర్ధుడు. ఒత్తిడిలోనూ నిలకడగా ఆడగల సత్తా ఉన్నవాడని తెలుస్తోంది. సమీర్‌ రిజ్వీ మంచి ఆల్ రౌండర్ కాబట్టే చెన్నై సూపర్‌ కింగ్స్‌ భారీ ధరకు అతన్ని కొనుగోలు చేసింది. ఇటీవల జరిగిన యూపీ టీ20 లీగ్ లో కాన్పూర్ సూపర్‌స్టార్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రిజ్వీ టోర్నీలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 104 పరుగులు చేసి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. అండర్ 23 స్టేట్ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో ఉత్తరప్రదేశ్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన రిజ్వీ.. యూపీ జట్టును విజేతగా నిలిపాడు. అరుణ్ జైట్లీ వేదికగా ఉత్తరాఖండ్‌ తో జరిగిన ఫైనల్లో రిజ్వీ 50 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టు కీలక పాత్ర పోషించాడు.