Vaibhav Suryavanshi News Updates | ఐపీఎల్ 2025కి ముందే సంచలనంగా మారిన 14 ఏళ్ల పిల్లాడు వైభవ్ సూర్యవంశీ. తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకంటూ మొన్న సెంచరీ బాదేశాడు. గుజరాత్ స్టార్ బౌలర్స్ ను ఎదుర్కొంటూ చిచ్చరపిడుగులా చెలరేగాడాడు. మరో సచిన్ వచ్చాడు, సెహ్వాగ్ కనిపించాడంటూ ఇంటర్నెట్ ని ఒక్కరోజులో అల్ల కల్లోలం చేసిపారేశారు. దాంతో చిన్నోడికి దిష్టి తగిలి, మరుసటి మ్యాచ్‌లోనే డకౌట్ అయ్యాడు వైభవ్ సూర్యవంశీ.

మొన్న ఫియర్ లెస్ ఇన్నింగ్స్.. అంతలోనే డకౌట్

భయం అనేదే లేకుండా మొన్నటి గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో అంతర్జాతీయ స్థాయి బౌలర్లను వైభవ్ సూర్యవంశీ ఓ ఆటాడుకున్నాడు. 11 సిక్సర్లు బాదిన ఆ బుడ్డోడు 35 బంతుల్లోనే సెంచరీ చేసి తన వైభవాన్ని మొదలుపెట్టాడు. ప్రపంచ క్రికెట్ కు తన పేరు ను పరిచయం చేయడం కాదు గుర్తుంచుకునేలా చేశాడు. సోషల్ మీడియాతో పాటు బయట సైతం ఎటు చూసినా వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోయింది. దాంతో మరుసటి మ్యాచ్ లో మరో మంచి ఇన్నింగ్స్ ఆడతాడేమో అనుకుంటే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో డకౌట్ అయిపోయాడు. భారీ స్కోరు మ్యాచ్ లో వైభవ్ బ్యాట్ ఝులిపిస్తే జట్టుకు ప్రయోజనం అనుకుంటే దిష్టి తగిలి ఖాతా తెరవకుండానే ఔటైపోయాడు.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ విసిరిన 218 పరుగుల టార్గెట్ ఛేదించేందుకు రాజస్తాన్ రాయల్స్ మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తో కలిసి బరిలోకి దిగిన సూర్యవంశీ ముంబై బౌలర్ దీపక్ చాహర్ బౌలింగ్ లో విల్ జాక్స్ క్యాచ్ పట్టడంతో సున్నా కే పెవిలియన్ చేరాడు. దాంతో కాస్త నిరాశగా, డల్ ఫేస్ పెట్టుకుని డగౌట్ కు వెళ్లాడు సూర్యవంశీ. అంత చిన్న ఏజ్ లో ఎంతో సాధించిన అతడిపై ఒత్తిడి పెంచడం, భారీగా ఆశించడంతో మనమే కారణమా అని ఫ్యాన్స్ అంతా భావించేలా పరిస్థితి తయారైంది.

అలా చేయొద్దని ద్రావిడ్ ముందే చెప్పాడు..

రాజస్తాన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అభిమానులను, క్రికెటర్లను ఈ విషయంపై సున్నితంగా వారించాడు. ప్రెస్ మీట్ లో తనను 19 ప్రశ్నలు అడిగితే అందులో 17 ప్రశ్నలు వైభవ్ సూర్యవంశీ గురించే అడిగారు. ఇంత చిన్న వయసులో వైభవ్ పై అంత అటెన్షన్ అవసరం లేదని, ప్రెజర్ పెంచటం తగదన్నాడు ద్రావిడ్. అతడు ఇంకా నేర్చుకోవాలని, తనను స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేలా వదిలేయాలని సూచించాడు. వైభవ్ బ్యాటింగ్ టెక్నిక్ సంగతి తను చూసుకుంటానని ద్రావిడ్ హామీ ఇచ్చాడు. సెంచరీ కొట్టిన నెక్ట్స్ మ్యాచ్ వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. కానీ వయసుకు మించిన అంచనాలు, అనుభవానికి మించిన ఒత్తిడి.. ఒక్క మాటలో చెప్పాలంటే బాలుడికి దిష్టి పెట్టేయడంతో డకౌట్ అయ్యాడని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.