IPL 2025 MI Climbs Top Place in Points Table: ముంబై ఇండియన్స్ కంబ్యాక్ అద్భుతంగా సాగుతోంది. వరుసగా ఆరో విజయంతో ఈ సీజన్ ను షేక్ చేసింది. గురువారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సరిగ్గా 100 పరుగులతో ఆతిథ్య రాజస్థాన్ రాయల్స్ పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ విధ్వంసకర ఫిఫ్టీ (38 బంతుల్లో 61, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించాడు. అనంతరం ఛేదనలో రాయల్స్.. 16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. పేసర్ జోఫ్రా ఆర్చర్ (27 బంతుల్లో 30, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చివర్లో బౌండరీలు బాది, టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో ఇంపాక్ట్ ప్లేయర్ కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ లకు మూడేసి వికెట్లతో సత్తా చాటారు. ఇక టోర్నీలో 8వ పరాజయంతో రాయల్స్ ఈ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఏడో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ముంబై చేరుకుంది.
ఓపెనర్ల విధ్వంసం.. బ్యాటింగ్ కు స్వర్గదామం లాంటి ఈ వికెట్ పై ఓపెనర్లు రెచ్చి పోయారు. రెండో ఓవర్లలోనే రివ్యూతో బతికి పోయిన రోహిత్ శర్మ (36 బంతుల్లో 53, 9 ఫోర్లు) సత్తా చాటాడు. అతనికి రికెల్టన్ తోడవడంతో ముంబై స్కోరు బోర్డు వేగంగా సాగింది. వీరిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓవర్ కి పది పరుగుల రన్ రేట్ తో రన్స్ సాధించారు. పవర్ ప్లేలో 58 పరుగులు చేసిన ముంబై.. ఆ తర్వాత ఓపెనర్లు మరింతగా రెచ్చిపోవడంతో వేగంగా పరుగులు సాధించింది. ఈ నేపథ్యంలో 29 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న రికెల్టన్.. ఆ తర్వాత కాసేపటికే ఔటయ్యాడు. దీంతో 116 పరగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత 31 బంతుల్లో రోహిత్ ఫిఫ్టీ పూర్తి చేసుకుని, పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెరో 48 పరుగులను సాధించి, జట్టుకు భారీ స్కోరు అందించారు.వీరద్దరూ అబేధ్యమైన మూడో వికెట్ కు 94 పరుగులు జోడించారు. బౌలర్లలో తీక్షణ, రియాన్ పరాగ్ కు చెరో వికెట్ దక్కింది.
బ్యాటర్ల ఘోర వైఫల్యం..గత మ్యాచ్ లో 210 పరగులను అలవోకగా ఛేదించిన రాయల్స్.. ఈ మ్యాచ్ లో మాత్రం తేలిపోయింది. ముఖ్యంగా బ్యాటర్లు వచ్చిన వాళ్లు, వచ్చినట్లు వెనుదిరగడంతో ఘోర పరాజయం పాలైంది. గత మ్యాచ్ లో సెంచరీ హీరో వైభవ్ సూర్యవంశీ డకౌట్ గా వెనుదిరగడంతో వికెట్ల పతనం ప్రారంభమైంది. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (13), నితీశ్ రాణా (9), కెప్టెన్ పరాగ్ (16), ధ్రువ్ జురెల్ (11), షిమ్రాన్ హిట్ మెయర్ డకౌట్ గా అయ్యి నిరాశ పర్చారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన శుభమ్ దూబే (15) ఆకట్టుకోలేకపోయాడు. అయితే చివర్లో జోఫ్రా ఆర్చర్ బౌండరీలు బాదడంతో రాయల్స్ వంద పరుగుల మార్కును దాటింది. మిగతా బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో వరుసగా ఆరో విజయంతో ముంబై దుమ్ము రేపింది. ఓవరాల్ గా ఈ సీజన్ లో ఏడో విజయంతో టాప్ ప్లేస్ కు చేరుకుంది.