Rishabh Pant Fine: లక్నో కెప్టెన్ పంత్, బౌలర్ దిగ్వేష్ సింగ్‌కు బీసీసీఐ షాక్- రూల్స్ ఉల్లంఘనతో జరిమానా
LSG Vs MI, Ekana Stadium | ముంబైతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నెగ్గినా కెప్టెన్ పంత్, బౌలర్ జిగ్వేష్ సింగ్ లకు బీసీసీఐ షాకిచ్చింది. ఐపీఎల్ రూల్స్ ఉల్లంఘించినందుకు జరిమానా విధించింది.
IPL 2025 LSG vs MI | లక్నో: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. శుక్రవారం రాత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ముంబై ఇండియన్స్ పై నెగ్గిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తో పాటు యువ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ కు బీసీసీఐ జరిమానా విధించింది. ఈ ప్లేయర్లు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు వేర్వేరు కారణాలతో జరిమానా విధించింది.
ఐపీఎల్ 2025లో భాగంగా ఏప్రిల్ 4న జరిగిన 16వ మ్యాచ్‌లో లక్నో జట్టు స్లో ఓవర్ రేటు కారణంగా కెప్టెన్ పంత్ కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఇది ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి (IPL Code of Conduct)లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ సీజన్‌లో లక్నో టీమ్ చేసిన తొలి తప్పిదం. నిబంధనల ప్రకారం జట్లు తమ నిర్ణీత ఓవర్లను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ముంబైతో మ్యాచ్ లో ఫీల్డ్ సెట్టింగ్ కు అధిక టైమ్ తీసుకోవడం, బౌలింగ్ మార్పులతో టైం పట్టడంతో.. నిర్ణీత టైం లోగా ఓవర్ల కోటాను లక్నో టీమ్ పూర్తి చేయలేదు. దాంతో జట్టు కెప్టెన్‌గా పంత్ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా విధించారు.
"శుక్రవారం రాత్రి లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో జట్టు స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది. ఆ కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు జరిమానా విధించినట్లు" ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న బౌలర్లలో 23 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ దిగ్వేష్ సింగ్ ఒకడు. అతడి మ్యాచ్ ఫీజులో ఏకంగా 50 శాతం జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం లెవల్ 1 తప్పిదం కారణంగా మ్యాచ్ ఫీజులో సగం కోత విధించినట్లు ప్రకటన విడుదల చేశారు.
వికెట్ తీసిన తర్వాత అనుచిత భాషను ఉపయోగించడం, అనుచితంగా ప్రవర్తించడం లాంటివి చేయడం ఈ సీజన్‌లో అతని రెండవ తప్పిందం. ఏప్రిల్ 1న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన LSG మ్యాచ్‌లో ఇప్పటికే ఒక డీమెరిట్ పాయింట్ దిగ్వేష్ సింగ్ కోల్పోయాడు. యువ బౌలర్ దిగ్వేష్ మొత్తం 3 డీమెరిట్ పాయింట్లతో ఉన్నాడు. ఐపీఎల్ డిసిప్లీనరీ ప్రోటోకాల్ ప్రకారం, లెవల్ 1 ఉల్లంఘనలు మ్యాచ్ రిఫరీ అధికార పరిధిలోకి వస్తాయి. వారు తీసుకున్నదే తుది నిర్ణయం ,ఆటగాళ్లు, జట్టు అందుకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది.
జిగ్వేష్ జరిమానా..
లక్నో టీమ్ జిగ్వేష్ ను మెగా వేలంలో రూ.30 లక్షలకు తీసుకుంది. ఇదివరకే పంజాబ్ తో మ్యాచ్ లో నోట్ బుక్ సెలబ్రేషన్ తో రూ.1.87 లక్షలు జరిమానాకు గురయ్యాడు. ముంబైతో మ్యాచ్ లోనూ మరోసారి అతిగా సెలబ్రేట్ చేసుకుని ఈసారి రూ.3.75 లక్షల జరిమానాకు గురయ్యాడు. ఓవరాల్ గా నాలుగు మ్యాచ్ లకే రూ.5.62 లక్షలు జరిమానా కట్టాడు.
మ్యాచ్ తరువాత ఆటగాళ్లు తమకు నచ్చిన రీతిలో సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ మ్యాచ్ మధ్యలో వికెట్లు తీసిన సందర్భాలలో, ఏదైనా ఇతరత్రా సందర్భంలో అవతలి జట్టు ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తిస్తూ ఐపీఎల్ నియమావళి ఉల్లంఘించినట్లు గుర్తిస్తే మాత్రం జరిమానాతో పాటు మెరిట్ పాయింట్లు కోల్పోతారు. ఇవి మరింత పెరిగితే మ్యాచ్ ల నుంచి నిషేధం పడిన సందర్భాలు ఉన్నాయి. పలువురు ఆటగాళ్లతో పాటు కెప్టెన్లు కొన్ని మ్యాచ్ లలో నిషేధం ఎదుర్కొన్నార.
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు మిచెల్ మార్ష్, ఐడెన్ మార్‌క్రమ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆపై బౌలింగ్ లోనూ సమష్టిగా రాణించడంతో పటిష్ట ముంబైని కట్టడి చేయగలిగారు. దిగ్వేష్ సింగ్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్ కీలక సమయాల్లో రాణించి వికెట్లు తీయడంతో ముంబై నుంచి విజయాన్ని లక్నో లాగేసుకుంది.