IPL 2025 PBKS 3RD Victory: వ పంజాబ్ కింగ్స్ సత్తా చాటింది. టోర్నీలో మూడో విజయాన్ని సాధించింది. గత మ్యాచ్ లో ఓటమి నుంచి తేరుకుని చెన్నై సూపర్ కింగ్స్ పై 18 పరుగులతో విజయం సాధించింది. దీంతో టోర్నీ టాప్ -4 జట్లలో నిలిచింది.  టాస్ నెగ్గి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 219 ప‌రుగులు చేసింది. యువ ఓపెన‌ర్ ప్రియాంశ్ ఆర్య ఐపీఎల్ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ (42 బంతుల్లో 103, 7 ఫోర్లు, 9 సిక్స‌ర్లు) చేసిన ఇండియ‌న్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో ఖ‌లీల్ అహ్మ‌ద్ (2/45) ఉన్నంత‌లో కాస్త ఫ‌ర్వాలేద‌నిపించాడు. అనంత‌రం ఛేద‌న‌లో మొత్తం ఓవ‌ర్లన్నీ ఆడిన సీఎస్కే 5 వికెట్ల‌కు 201 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ డేవ‌న్ కాన్వే స్లో ఫిఫ్టీ (49 బంతుల్లో 69 రిటైర్డ్ ఔట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కాస్త విసుగెత్తించాడు. లోకీ ఫెర్గూస‌న్ రెండు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. ఈ విజ‌యంతో పంజాబ్ నాలుగో ప్లేస్ కు ఎగ‌బాకింది. 

ప్రియాంశ్ విధ్వంసం..ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ త‌ర‌పున ప్రియాంశ్ ఆర్య వ‌న్ మేన్ షో చూపించాడు. టాప్, మిడిలార్డ‌ర్ విఫ‌ల‌మైన వేళ‌, త‌ను మాత్రం సూప‌ర్ ట‌చ్ లో క‌నిపించాడు. తొమ్మిది సిక్స‌ర్లు, ఏడు ఫోర్ల‌తో ధమాకా ఆట‌తీరుతో మైమ‌రిపించాడు. ఫ‌స్ట నుంచి ధాటిగా ఆడిన ప్రియాంశ్.. 19 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టాడు. దీంతో ప‌వ‌ర్ ప్లేలో 75 ప‌రుగులు వ‌చ్చాయి. ఒక వైపు వికెట్లు ప‌డుతున్నా, త‌న ధాటిని కొన‌సాగించిన ప్రియాంశ్ 39 బంతుల్లో సెంచ‌రీ సాధించాడు. దీంతో ఈ టోర్నీలో నాలుగో ఫాస్టెస్ట్ సెంచ‌రీనీ త‌న ఖాతాలో వేసుకున్నాడు. చివ‌ర్లో శ‌శాంక్ సింగ్ మెరుపు ఫిఫ్టీ (36 బంతుల్లో 52 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు)తో స‌త్తా చాట‌గా, మార్కో యాన్సెన్ (34 నాటౌట్) తో మెరుపులు మెరిపించారు. వీరిద్ద‌రూ అబేధ్య‌మైన ఏడో వికెట్ కు 65 ప‌రుగులు జ‌త చేశారు మిగ‌తా బౌలర్ల‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ కు రెండు వికెట్లు ద‌క్కాయి. 

స్లో బ్యాటింగ్..220 ప‌రుగుల టార్గెట్ ను ఛేజింగ్ చేయ‌డానికి కావాల్సిన బ్యాటింగ్ ప‌వ‌ర్ ను చెన్నై చూపించ‌లేక పోయింది. ధ‌నాధ‌న్ ఆట‌తీరును చూయించడంలో విఫ‌ల‌మ‌య్యారు. అయితే గ‌త మ్యాచ్ ల‌తో పోలిస్తే, మంచి బ్యాటింగ్ ప్ర‌దర్శ‌నే క‌న‌బ‌ర్చారు. ఇక కాన్వేతో కలిసి మ‌రో ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర (36) కాస్త వేగంగా ఆడే ప్ర‌య‌త్నంలో ఔట‌య్యాడు. దీంతో తొలి వికెట్ కు 61 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. ఈ ద‌శ‌లో రుతురాజ్ గైక్వాడ్ (1) వెంట‌నే ఔట్ కావ‌డంతో సీఎస్కే క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో శివ‌మ్ దూబే (27 బంతుల్లో 42) తో క‌లిసి కాన్వే, జ‌ట్టును ఆదుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ క్ర‌మంలో 37 బంతుల్లో ఫిఫ్టీని కాన్వే సాధించాడు. అయితే దూబేను ఔట్ చేసి ఫెర్గూస‌న్ షాకిచ్చాడు. చివ‌ర్లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (27) జ‌ట్టును గెలిపించే ప్ర‌య‌త్నం చేశాడు. కాన్వే 13 బంతులు మిగిలి ఉండ‌గా రిటైర్డ్ ఔట్ అయ్యాడు. చివర్లో ధోనీ ఔట్ కావడం, మిగతా బ్యాటర్లు భారీ షాట్లు ఆడటంతో విఫలం కావడంతో  చెన్నైకి నాలుగో ఓటమి తప్పలేదు.