Rishabh Pant Funny Memes | ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల‌తో ఘన విజ‌యం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ పై ట్రోలింగ్ జరుగుతోంది. ఇదివరకే టోర్నీలో ఖరీదైన ఆటగాడు కావడంతో అతడిపై భారీ అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమైన బ్యాటింగ్ సంచలనం పంత్ మీద సెటైర్లు పేలుతున్నాయి. టాలెంట కంటే హైప్, పెయిడ్ పీఆర్ అంటూ పంత్ ను ఏకిపారేస్తున్నారు.

లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నికోల‌స్ పూరన్ (30 బంతుల్లో 44, 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించడంతో 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల‌కు 171 ప‌రుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ కేవ‌లం 16.2 ఓవ‌ర్లలో 2 వికెట్ల‌కు 177 ప‌రుగులు చేసి టార్గెట్ ఛేదించింది. ఓపెన‌ర్ ప్ర‌భు సిమ్రాన్ సింగ్ ప్ర‌తాపం (34 బంతుల్లో 69, 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52, 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. 

మ్యాచ్ ముగిసిన తరువాత లక్నో ఓనర్ గోయెంకా జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ మీద మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కొందరేమో కర్మ ఫలితం అని పంత్ ను ట్రోల్ చేస్తున్నారు. గతేడాది మెగా వేలంలో తనను పంజాబ్ తీసుకుంటుందేమోనని భయపడ్డా అంటూ అతడు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పుడు అదే జట్టు మీద స్కోరు చేయలేకపోయావు, కనీసం జట్టును కూడా గెలిపించుకోలేకపోయావంటూ పంత్ ను ఏకిపారేస్తున్నారు పంజాబ్ ఫ్యాన్స్. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని, కర్మ ఫలాన్ని పంత్ అనుభవించక తప్పదు అంటున్నారు.

పంత్ టాలెంట్ కంటే ఎక్కువ హైప్ ఇచ్చారు. పెయిడ్ పీఆర్ తో నెట్టుకొస్తున్నాడని ట్రోలింగ్ చేస్తున్నారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రెండు మ్యాచ్ లలో 149 పరుగులు చేశాడు. లక్నో కెప్టెప్ పంత్ ఆడిన 3 మ్యాచ్ లలో కేవలం 17 పరుగులు చేసి విమర్శల పాలవుతున్నాడు. గతేడాది మెగా వేలంలో పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో సొంతం చేసుకోగా, అయ్యర్ ను పంజాబ్ రూ.26.75 కోట్లకు తీసుకుంది. 

తొలి మ్యాచ్ లో డకౌట్ తరువాత పంత్ మీద ట్రోలింగ్ జరిగింది. మ్యాచ్ అనంతరం పంత్ చెప్పేది వినిపించుకోకుండా ఓనర్ సంజీవ్ గోయెంకా ఏదో క్లాస్ పీకడం వైరల్ అయింది. ఆపై పంత్ మీద తమకు నమ్మకం ఉందని నష్ట నివారణ చర్యలు చేపట్టారు. రెండో మ్యాచ్ లో పూరన్, మిచెల్ మార్ష్ విధ్వంసంతో లక్నో గెలిచింది. ఆ మ్యాచ్ లోనూ పంత్ నిరాశపరిచాడు. జట్టు గెలవడతంతో లక్నో ఓనర్ గోయెంకా హ్యాపీ. మూడో మ్యాచ్ లో అటు బ్యాటింగ్ లో పంత్ ఫెయిల్ కావడం, ఇటు మ్యాచ్ సైతం ఓడిపోవడంతో మరోసారి పంత్ మీద గోయెంకా గుస్స అయ్యాడోచ్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రూ.27 కోట్లకు పంత్ ను తీసుకుంటే రూ.1 కోటికి ఒక పరుగు చొప్పున చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు పంత్ కు మద్దతుగా నిలిచారు. లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ ను చూసిన తరువాత ఓనర్లను స్టేడియంలోకి అనుమతించకూడదు అని డిమాండ్ చేస్తున్నారు. ప్లేయర్లకు మర్యాద ఇవ్వడం తనకు తెలియదని, ఆటలో గెలుపోటములు సహజమేనని పంత్ కు సపోర్ట్ చేస్తున్నారు. అన్ని ఫ్రాంచైజీల ఓనర్లను కాకున్నా, లక్నో ఓనర్ గోయెంకాను మాత్రం స్టేడియంలోకి అనుమతించకుండా ఆయనపై నిషేధం విధించాలని బీసీసీని నెటిజన్లు, క్రికెట్ ప్రేమికులు కోరుతున్నారు.