RCB vs PBKS IPL 2025 Final: టైటిల్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఎట్టకేలకు ఐపీఎల్ లో మరో కొత్త విజేత అవతరించనుంది. జూన్ 3న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ ట్రోఫీ కోసం ఫైనల్లో పంజాబ్, ఆర్సీబీ తలపడతాయి. ఏ జట్టు గెలిచినా ఈసారి కొత్త విజేత అవతరిస్తుంది. ఈ రెండు జట్లు మొదటి సీజన్ నుండి ఆడుతున్నా ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేకపోయాయి. అహ్మదాబాద్‌లో ఐపీఎల్ ఫైనల్ జరిగే జూన్ 3న వర్షం పడే అవకాశం ఉంది. దాంతో ఫైనల్‌ సమయంలో వర్షం పడితే పరిస్థితి ఏంటి, రిజర్వ్ డే గురించి నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

పంజాబ్ కింగ్స్, RCB లీగ్ స్టేజీలో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో వరుసగా 1, 2 స్థానాల్లో ఉన్నాయి. రెండు జట్ల మధ్య జరిగిన మొదటి క్వాలిఫైయర్‌లో పంజాబ్ మీద RCB విజయం సాధించింది. ఓడిపోయిన పంజాబ్ రెండవ క్వాలిఫైయర్‌లో పటిష్టమైన ముంబై ఇండియన్స్ జట్టును ఓడించి ఫైనల్ చేరుకుంది. 204 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో ఛేదించి పంజాబ్ ఫైనల్ చేరింది. శ్రేయస్ అయ్యర్ 87 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.

రెండవ క్వాలిఫైయర్‌లో వర్షం కారణంగా మ్యాచ్ 2 గంటల ఆలస్యంగా మొదలైంది. ఓ దశలో మ్యాచ్ రద్దు అవుతుందని అనిపించింది. ఎందుకంటే ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. మ్యాచ్ రద్దు అయితే లీగ్ స్టేజీలో మెరుగైన స్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరేది. వర్షం ఆగడంతో మ్యాచ్ నిర్వహించి విజేతను తేల్చారు. కానీ ఐపీఎల్ ఫైనల్‌లో వర్షం పడితే ట్రోఫీ ఎవరికి దక్కుతుంది, కండీషన్స్ ఏంటని క్రికెట్ అభిమానులు సెర్చ్ చేస్తున్నారు.

జూన్ 3న అహ్మదాబాద్‌లో వర్షం పడే ఛాన్స్

జూన్ 3న అహ్మదాబాద్ లో వర్షం పడే అవకాశం ఉంది. దాంతో ఫైనల్ జరగాల్సిన నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో పంజాబ్, ఆర్సీబీ టైటిల్ పోరు వర్షం వల్ల ప్రభావితం కావచ్చు. ఆ రోజు వర్షం పడే అవకాశం 20 శాతం ఉంది. ఉదయం వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉండగా, మ్యాచ్ సమయంలో కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి.

IPL 2025 ఫైనల్‌లో రిజర్వ్ డే ఉందా?

ఒకవేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ ఫైనల్‌ మ్యాచ్ జూన్ 3న నిర్వహించడానికి వీలు కుదరకపోతే రిజర్వ్ డే ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయినా, మ్యాచ్ నిర్వహణ సాధ్యం అవకపోతే జూన్ 4న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రిజర్వ్ డే ఉంది కనుక ఎలాగైన మ్యాచ్ నిర్వహిస్తారు. రిజర్వ్ డే రోజు ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహణకు ఇబ్బంది కలిగితే.. కనీసం 5 ఓవర్ల పాటు మ్యాచ్ నిర్వహిస్తారు. సూపర్ ఓవర్ లాంటి కనీసం ఒక ఓవర్ మ్యాచ్ నిర్వహించి విజేతను ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండు రోజులు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాని పక్షంలో పంజాబ్ జట్టు ఐపీఎల్ విజేతగా అవతరిస్తుంది. లీగ్ స్టేజీలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటించాలని ఐపీఎల్ నిబంధనలు చెబుతున్నాయి.

IPL ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్

  • జట్లు: బెంగళూరు vs పంజాబ్ కింగ్స్
  • తేదీ: జూన్ 3, 2025
  • సమయం: మంగళవారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం
  • టాస్: రాత్రి 7 గంటలకు
  • స్థలం: నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్