IPL 2025 MI VS PBKS Qualifier 2 Live Updates: పంజాబ్ అద్భుతం చేసింది. టోర్నీ చరిత్రలో రెండోసారి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ పై 5 వికెట్లతో ఉత్కంఠభరిత విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులు చేసింది. తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ చెరో 44 పరుగులతో టాప్ స్కోరర్లు గా నిలిచారు. బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్ జాయ్ కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ లో 19 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసిన పంజాబ్, ఘన విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (41 బంతుల్లో 87 నాటౌట్, 5 ఫోర్లు, 8 సిక్సర్లు) తో సత్తా చాటి జట్టును ఫైనల్ కు చేర్చాడు. బౌలర్లలో అశ్వనీ కుమార్ కు రెండు వికెట్లు దక్కాయి. అలాగే టోర్నీ చరిత్రలో ముంబైపై తొలిసారి 200+ పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసింది. ముంబై తొలిసారి 200+ పరుగులు చేసి, ఓడిపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. జూన్ 3న ఇదే వేదికపై పంజాబ్, ఆర్సీబీ జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది. టోర్నీ చరిత్రలో మూడుసార్లు ఫైనల్ కు చేరిన ఆర్సీబీ, ఒక్కసారి చేరిన పంజాబ్ రన్నరప్ గానే నిలిచాయి. ఫైనల్ తర్వాత ఈసారి కొత్త చాంపియన్ ను చూడబోతున్నాం.
రివర్స్ గేర్..నిజానికి భారీ టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన పంజాబ్ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ (6) వికెట్ త్వరగానే కోల్పోయింది. ఈ దశలో వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లీస్ (21 బంతుల్లో 38, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రివర్స్ గేర్ తో ఎదురుదాడికి దిగడంతో పంజాబ్ మ్యాచ్ లోకి వచ్చింది. వికెట్ పడినప్పటికీ వేగంగా ఆడుతూ మూమెంటంను పంజాబ్ వైపు మార్చాడు. ముఖ్యంగా భారత స్టార్ జస్ ప్రీత్ బుమ్రా ఓవర్లో ఏకంగా 20 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (20) కూడా దూకుడుగా ఆడటంతో వేగంగా పరుగులు వచ్చాయి. పవర్ ప్లేలో 64 పరుగులు సాధించిన పంజాబ్.. చివర్లో ఆర్య వికెట్ కోల్పోయింది. దీంతో రెండో వికెట్ కి నమోదైన 42 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ దశలో శ్రేయస్.. తన విలువేంటో చాటాడు. ఇంగ్లీస్ త్వరగానే ఔటయినప్పటికీ, నేహాల్ వధేరా (29 బంతుల్లో 48, 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి మ్యాచ్ ను మలుపు తిప్పే భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో ముంబై ఒత్తిడిలో పడిపోయింది. చకచకా పరుగులు సాధిస్తూ నాలుగో వికెట్ కు కేవలం 47 బంతుల్లోనే 84 పరుగులు జోడించారు. చివర్లో నేహాల్ ఔటైనా.. శ్రేయస్ సిక్సర్లతో చెలరేగాడు. 27 బంతుల్లోనే ఫిఫ్టీ చేసిన శ్రేయస్.. ఆ తర్వాత మరో ఓవర్ ఉండగానే మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. ఇక మార్కస్ స్టోయినిస్ (2 నాటౌట్) తో కలిసి ఐదో వికెట్ కు అజేయంగా 38 పరుగులు జోడించి, జట్టును శ్రేయస్ విజయతీరాలకు చేర్చాడు. ఇక క్వాలిఫయర్ 1లో తమను ఓడించిన ఆర్సీబీపై ప్రతీకారం తీర్చుకోవాలని పంజాబ్ భావిస్తోంది. అలాగే మూడో ఫ్రాంచైజీని ఫైనల్ కు చేర్చిన ఏకైక కెప్టెన్ గా శ్రేయస్ రికార్డులకెక్కాడు.
సూర్య కుమార్ వీరంగం.. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబైకి బ్యాటర్లు భారీ స్కోరును అందించారు. ఈ మ్యాచ్ లో స్టార్ బ్యాటర్ సూర్య రికార్డుల మీద రికార్డులు నెలకొల్పాడు. టీ20ల్లో వరుసగా 25+వ స్కోరును 16వ సారి సూర్య సాధించాడు. అలాగే ఈ మ్యాచ్ లో 700 పరుగులను దాటిన సూర్య.. ముంబై తరపున ఈ మార్కును చేరిన తొలి బ్యాటర్ గా, అలాగే నాన్ ఓపెనర్ ప్లేయర్ గానూ నిలిచాడు. అలాగే ఈ మైలురాయిని చేరిన మూడో భారత ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. గతంలో విరాట్ కోహ్లీ, శుభమాన్ గిల్ మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇక సూర్య బ్యాటింగ్ కు దిగిన తర్వాత ఎక్కువగా స్ట్రైక్ తీసుకుని తన మార్కు షాట్లతో రెచ్చిపోయాడు. కళ్లు చెదిరే మూడు సిక్సర్లతో చెలరేగాడు. తిలక్ తో కలిసి కీలకమైన 72 పరుగులను జోడించాడు. అయితే వీరిద్దరూ వరుస ఓవర్లలో ఔట్ కావడంతో ముంబై కాస్త వెనుకంజలో నిలిచింది. ఆ తర్వాత నమన్ ధీర్ (18 బంతుల్లో 37,7 ఫోర్లు) సూపర్ క్యామియోతో 7 ఫోర్లతో చేలరేగి, వేగంగా ఆడాడు. దీంతో ముంబై 200 పరుగుల మార్కును దాటింది. అంతకుముందు ఈ దశలో జానీ బెయిర్ స్టో (24 బంతుల్లో 38, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మంచి టచ్ లో వేగంగా ఆడాడు.