IPL 2025 MI Get 200+ Runs in Qualifier 2 Vs PBKS: కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. ఫైనల్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై జూలు విదిల్చింది. ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ (29 బంతుల్లో 44,2 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్య కుమార్ యాదవ్ (26 బంతుల్లో 44, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తో టాప్ స్కోరర్లు గా నిలిచారు. బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్ జాయ్ కు రెండు వికెట్లు దక్కాయి.
రోహిత్ విఫలం.. గత మ్యాచ్ లో సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన రోహిత్ శర్మ (8) విఫలమయ్యాడు. ఆరంభంలోనే ఫోర్ కొట్టి జోరు చూపించిన రోహిత్.. తర్వాత తనకు లభించిన లైఫ్ ను కూడా వినియోగించుకోలేక పోయాడు. తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్ ఆడబోయి డీప్ లో క్యాచౌట్ అయ్యాడు. దీంతో 19 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో జానీ బెయిర్ స్టో (24 బంతుల్లో 38, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి తిలక్ చక్కని భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ సీజన్ లో రెండో మ్యాచే ఆడుతున్న బెయిర్ స్టో.. మంచి టచ్ లో కన్పించి, వేగంగా పరుగులు సాధించాడు. తిలక్ కూడా దూకుడుగా ఆడటంతో రెండో వికెట్ కు 51 పరుగులు జోడించారు. ఆ తర్వాత స్కూప్ షాట్ ఆడబోయి బెయిర్ స్టో ఔటయ్యాడు.
సూర్య రికార్డుల జాతర.. ఈ మ్యాచ్ లో స్టార్ బ్యాటర్ సూర్య రికార్డుల మీద రికార్డులు నెలకొల్పాడు. టీ20ల్లో వరుసగా 25+వ స్కోరును 16వ సారి సూర్య సాధించాడు. అలాగే ఈ మ్యాచ్ లో 700 పరుగులను దాటిన సూర్య.. ముంబై తరపున ఈ మార్కును చేరిన తొలి బ్యాటర్ గా, అలాగే నాన్ ఓపెనర్ ప్లేయర్ గానూ నిలిచాడు. అలాగే ఈ మైలురాయిని చేరిన మూడో భారత ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. గతంలో విరాట్ కోహ్లీ, శుభమాన్ గిల్ మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇక సూర్య బ్యాటింగ్ కు దిగిన తర్వాత ఎక్కువగా స్ట్రైక్ తీసుకుని తన మార్కు షాట్లతో రెచ్చిపోయాడు. కళ్లు చెదిరే మూడు సిక్సర్లతో చెలరేగాడు. తిలక్ తో కలిసి కీలకమైన 72 పరుగులను జోడించాడు. అయితే వీరిద్దరూ వరుస ఓవర్లలో ఔట్ కావడంతో ముంబై కాస్త వెనుకంజలో నిలిచింది. ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15) బంతులు వేస్ట్ చేసి స్లోగా ఆడగా, నమన్ ధీర్ (18 బంతుల్లో 37,7 ఫోర్లు) సూపర్ క్యామియోతో 7 ఫోర్లతో చేలరేగి, వేగంగా ఆడాడు. ఇక పంజాబ్ ఫీల్డర్లు కూడా సరిగ్గా ఫీల్డింగ్ చేయకపోవడంతో ముంబైకి అదనపు పరుగులు లభించాయి. ఓవరాల్ గా ముంబై 200 పరుగుల మార్కును దాటింది. ఇక ఈ టోర్నీ చరిత్రలో 200 పరుగులు చేసిన ఏ ఒక్కసారి కూడా ముంబై ఓడిపోలేదు. గతంలో 18 సార్లు ఈ మార్కు చేరిన ప్రతీసారి విజయం సాధించింది.