Rishabh Pant IPL 2025 Auction: హైదరాబాద్: ఐపీఎల్ 2025 వేలానికి మరికొన్ని రోజులే ఉన్నాయి. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో సూపర్ ప్లేయర్లను దక్కించుకోవాలని ప్రతీ ఐపీఎల్ మేనేజ్ మెంట్ కోరుకుంటోంది. కానీ ప్రస్తుతం వేలంలో ఉన్న 12 మార్కీ ప్లేయర్లలో అన్నీ ఫ్రాంచైజీల తొలి ప్రాధాన్యం కోసం యునానిమస్ గా వినిపిస్తున్న పేరు రిషభ్ పంత్ (Rishabh Pant). ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కి కెప్టెన్ గా ఉన్న పంత్ ను ఢిల్లీ రీటెయిన చేసుకోలేదు. మెగా వేలంలోకి వదిలేసింది. ఈ నిర్ణయం వ్యూహాత్మకమా లేదా కావాలనే పంత్‌ను డీసీ వదిలించుకుందా అనే వదంతులపై మరో ఐదు రోజుల్లో క్లారిటీ రానుంది. 


పంత్ కోసం పోరాటం తప్పదా?


వాస్తవానికి వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఇప్పుడున్న ఫామ్ చూసిన ఎవరైనా అతడ్ని రీటెయిన్ చేసుకుంటారు. అతని పోరాట తత్వం, వికెట్ కీపింగ్ స్కిల్స్, , ఫైరింగ్ గేమ్, ఏ జట్టుకైనా అడ్వాంటేజ్ అవుతాయి. ఇంకా చెప్పాలంటే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చేజారుతున్న సమయంలో పంత్ చేసిన మ్యాజిక్ ఏంటో కొన్ని రోజుల కిందట అందరికీ తెలిసిందే. మ్యాచ్ దక్షిణాఫ్రికా చేతిలోకి వెళ్లగా, మూమెంటన్ ఛేంజ్ చేయడానికి సడన్ గా మైదానంలో పడిపోయాడు పంత్. కొంత సమయం వృథా చేయడంతో సఫారీలు మూమెంటమ్ కోల్పోయారు. ఆపై టీ20 వరల్డ్ కప్ ను భారత్ సొంతం చేసుకుంది. 


ఇంత బ్రిలియంట్ మైండ్ గేమ్ ఆడగల పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసుకోవటం కేవలం అతడి మార్కెట్ ను పెంచేందుకేనని కొంత మంది విశ్లేషకులు అంటున్నారు. పైగా ఢిల్లీ దగ్గర రైట్ టూ మ్యాచ్ (Right To Match Card) కార్డ్ ఉంటుంది. ఎవరైనా పంత్ ఎక్కువ మొత్తం చెల్లించి తీసుకోవాలని చూసినా, ఖచ్చితంగా అతడ్ని దక్కించుకుంటారని చెప్పలేం. ఎందుకంటే.. రైట్ టూ మ్యాచ్ రూల్ ప్రకారం వాళ్ల దగ్గర నుంచి పంత్ ను అంతే మొత్తానికి ఢిల్లీ తీసుకోవచ్చు. కానీ పంత్ ను దక్కించుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ట్రై చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 



చెన్నైకి కొన్నేళ్ల పాటు కీపింగ్ తో పాటు బ్యాటింగ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడే ఓ స్ట్రాంగ్ వికెట్ కీపర్ కావాలి. ఇప్పుడున్న వారిలో చూసుకుంటే బెస్ట్ ఆప్షన్ రిషభ్ పంత్ కనిపిస్తున్నాడు. కెప్టెన్సీలో ధోనీ అంత కాకపోయినా, కీపింగ్ తో పాటు బ్యాటింగ్ లో ధోనీ స్థాయిలో విరుచుకుపడి ఆడే సత్తా పంత్ సొంతం. ఈ క్రమంలో పంత్ అయితేనే చెన్నైకి కరెక్ట్ ఆప్షన్ అని సీఎస్కే మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. 



ఈ ఫ్రాంచైజీలు సైతం పంత్‌పై కన్నేశాయా?


మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ లాంటి టీమ్స్ కూడా కనీసం అయిదేళ్లు జట్టుకు మెరుపు ఇన్నింగ్స్, అద్భుతమైన కీపింగ్ ఆప్షన్ కోసం వెతుకుతున్నాయి. హెన్రిచ్ క్లాసెన్ ను ఒత్తిడి తగ్గించేందుకు రిషభ్ పంత్ ను తీసుకోవాలని సన్ రైజర్స్ భావిస్తోందని ప్రచారంలో ఉంది. అదే సమయంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ వదిలేయటంతో లక్నో సూపర్ జెయింట్స్ సైతం టాలెంటెడ్ పర్సన్ ను కెప్టెన్ చేయాలని చూస్తోంది. పంజాబ్ విషయానికొస్తే ఇద్దరినే రిటైన్ చేసుకుంది. వాళ్లు సైతం పంత్ ను తీసుకునేందుకు పెద్ద మొత్తంలో వేలం పాడే ఛాన్స్ ఉంది. వేలంలో పంత్ కోసం జరిగే పోటీలో టోర్నీ చరిత్రలో అత్యధిక ధర పలికిన మిచెల్ స్టార్క్ 24 కోట్ల 75లక్షల రూపాయల మార్క్ ను రిషభ్ పంత్ బ్రేక్ చేస్తాడని అంచనాలున్నాయి. ఏమో గుర్రం ఎగరా వచ్చు అన్నట్లుగా ఐపీఎల్ చరిత్రలో రూ. 30కోట్ల రికార్డు మార్కును అందుకున్న తొలి ప్లేయర్‌గా పంత్ సరికొత్త రికార్డులు  క్రియేట్ చేసినా ఆశ్చర్యం లేదు.