Slowest hundred in IPL: రాజస్థాన్ రాయల్స్(RR)పై బెంగళూరు(RCB) ఓడిపోవడంపై సర్వత్రా విమర్శల జడివాన కురుస్తోంది. బెంగళూరు విజయాలు బెంగ తీరడం లేదంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కింగ్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్‌లోనే తొలి శతకంతో చెలరేగిన వేళ... రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. జోస్ బట్లర్, సంజు శాంసన్ విధ్వంసంతో రాజస్థాన్... బెంగళూరుపై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓటమికి కోహ్లీ కూడా ఓ కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు. కోహ్లీ నెమ్మిదిగా బ్యాటింగ్ చేయడం కూడా ఓటమికి కారణమని సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. సాక్ష్యాత్తు రాజస్తాన్ రాయల్స్ కూడా 200 పరుగులకు పైగా స్కోరు సాధ్యమయ్యే చోట 184 కూడా పర్లేదులెండి అంటూ కోహ్లి ఇన్నింగ్స్‌పై సెటైర్లు వేసింది.
కోహ్లీ పేరిట ఓ చెత్త రికార్డు
రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి 72 బంతుల్లో 113 పరుగులు సాధించాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. కోహ్లీ 67 బంతుల్లో వంద పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో భారత గడ్డపై సెంచరీ కొట్టడానికి 67 బంతులు తీసుకోవడం ఇదే తొలిసారి . అంటే ఐపీఎల్‌ఎలో భారత గడ్డపై స్లోయెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా కోహ్లీ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మనీశ్ పాండే 2009 సీజన్‌లో దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో 67 బంతుల్లోనే శతకం చేశాడు. ఇప్పుడు ఓవరాల్‌గా మనీశ్ పాండేతో కలిసి కోహ్లీ ఈ చెత్త రికార్డులో భాగస్వామిగా మారాడు. టీ20 క్రికెట్‌లో కోహ్లి యాభై కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న సందర్భాల్లో బెంగళూరు జట్టు 96 శాతం మ్యాచ్‌లు ఓడిపోయిందంటూ గణాంకాలు షేర్ చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో 7500 పరుగుల మైలురాయి అందుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
కోహ్లీ ఏమన్నాడంటే..?
పిచ్ కాస్త ప్లాట్‌గా అనిపించిందని... మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ స్వభావం మారిపోయిందని కోహ్లీ అన్నాడు. చివరి వరకు ఒక్కరైనా బ్యాటింగ్ చేయాలని భావించామని అందుకే సమయోచితంగా బ్యాటింగ్ చేశానని కోహ్లీ తెలిపాడు. ఈ పిచ్‌పై 183 రన్స్.. మెరుగైన స్కోరే అనిపించదని కోహ్లీ అన్నాడు. తాను దూకుడుగా ఆడలేకపోయానని తనకు తెలుసన్నాడు. ఈ పిచ్‌పై పరుగులు రాబట్టడం బ్యాటర్లకు అంత సులువేమీ కాదని కూడా కోహ్లీ అన్నాడు. ఇదే మ్యాచ్‌లో రాజస్తాన్ బ్యాటర్ జోస్ బట్లర్ 58 బంతుల్లోనే 100 పరుగుల మార్కు అందుకుని సిక్సర్‌తో జట్టును గెలిపించడం విశేషం.