PL 2024  top indian players till now:  దేశమంతా ఐపీఎల్‌(IPL) సందడి కొనసాగుతోంది.  ఒక్కో ప్లేయర్ ఒక్కో మ్యాచ్ లో అదరగొడుతుండటంతో క్రికెట్ ప్రేమికులు ఊగిపోతున్నారు. ఒక పక్క పరుగులు వరదతో మరోపక్క వికెట్ల వేటతో క్రికెట్‌ అభిమానులు పొంగిపోతున్నాడు. ఈ నేపధ్యంలో  ఇప్పటివరకు జరిగిన  మ్యాచుల్లో టాప్ 5 ప్రదర్శన చేసిన  మన ఆటగాళ్ళ గురించి తెలుసుకుందాం.


1)మయాంక్ యాదవ్ -ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో  పుట్టిన కొత్త పేసర్ మయాంక్ యాదవ్. లక్నో సూపర్ జెయింట్స్-పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో డెబ్యూ చేసిన మయాంక్ యాదవ్.. ఈ సీజన్‌లోనే ఫాస్టెస్ట్ డిలివరీ వేశాడు. ఏకంగా 155.8 కి.మీ వేగంతో పంజాబ్ బ్యాటర్లపై బంతులు సంధించాడు.  అందరి దృష్టిని ఆకర్షించాడు. 4 ఓవర్లు వేసిన మయాంక్ కేవలం 27 పరుగులు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీశాడు. ప్రత్యర్ధి బ్యాటర్లను బంబేలెత్తించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఆ రికార్డ్ ను రెండు రోజుల్లోనే   బ్రేక్ చేశాడు గెరాల్డ్ కోయెట్జీ. అయితేనేం మయాంక్ యాద‌వ్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు.


2) విరాట్ కోహ్లీ - రెండు నెలల విరామం తరువాత వచ్చినా ఐపీఎల్ 2024ను విరాట్ కోహ్లీ అద్భుతంగా ప్రారంభించాడు. కింగ్‌ కోహ్లీ ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడి 181 పరుగులతో అగ్రస్థానంలో నిలిచి ఆరెంజ్ క్యాప్  రేసులో ఉన్నాడు. పంజాబ్‌, కోల్‌కత్తాపై అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మూడు మ్యాచ్‌ల్లో బెంగళూరు టీం  రెండింటిని  ఓడిపోయినప్పటికీ కోహ్లీ మాత్రం తన ఆటతీరుతో అభిమానులను మంత్రముగ్దులను చేస్తున్నాడు.  పనిలో పనిగా ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ ప‌లు రికార్డులు నెల‌కొల్పాడు.


3‌‌) రియాన్ పరాగ్ - రాజస్థాన్‌ తరపున ఆడుతున్న రియాన్‌ పరాగ్‌ ఈ ఐపీఎల్‌లో భిన్నమైన ఆటగాడు.   24ఏళ్ల ఈ అసోం ఆటగాడి దూకుడే ముంబైతో జరిగిన    మ్యాచ్ లో రాజస్థాన్ విజయానికి  కారణమయ్యింది.  ఐపిఎల్ 17లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ మంచి ప్రదర్శన చేసిన రియాన్ పరాగ్.. ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులోకి, కోహ్లీ సరసకి దూసుకొచ్చాడు. కోహ్లీ తో పోలిస్తే ఇద్దరివీ 181 పరుగులే అయినప్పటికీ విరాట స్ట్రైక్ రేట్ కంటే మెరుగైన స్ట్రైక్ రేట్  కావటంతో పరాగ్ కే ఆరెంజ్ క్యాప్ లభించింది.


4) మహేంద్ర సింగ్ ధోనీ -ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి విశాఖపట్నంలో చెన్నై సూపర్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్  జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్ జట్టు విజయం సాధించింది. అయితేనేం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం  విశాఖలో దుమ్మురేపాడు. పాత ధోనీని తలపిస్తూ స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించాడు.  విధ్వంసకర బ్యాటింగ్‌తో పాత ధోనీని తలపిస్తూ బౌలర్లను వణికించాడు.   ఆకాశమే హద్దుగా చెలరేగి 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాచ్ పోయినా అభిమానుల మనసులను మాత్రం ఎప్పటిలాగే దోచుకున్నాడు ధోనీ. 


5) రిషభ్‌ పంత్‌ - ఘోర రోడ్డు ప్రమాదం .. దాదాపు ఏడాదిన్నర తర్వాత మైదానంలోకి అడుగు పెట్టాడు రిషభ్‌ పంత్‌. మొదటి రెండు మ్యాచుల్లో పర్వాలేదనిపించాడు .. అంచనాలు అందుకుంటాడా అని అనుమానం వచ్చే లోపే  చెన్నైతో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఒంటి చేత్తో సిక్స్‌ కొట్టడంతో మునుపటి పంత్‌ను గుర్తుకు తెచ్చాడు.