ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మినీ వేలం ప్రక్రియ ముగిసింది. ఇక ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐపీఎల్ క్రికెట్ సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చి 22 నుంచి ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మార్చి 22 నుంచి IPL ప్రారంభం కానుందని సోషల్ మీడియాతోపాటు జాతీయ మీడియా సంస్థల్లో కోడై కూస్తున్నాయి. సూమారు రెండు నెలలపాటు సాగనున్న ఈ టోర్నీ మే నెల చివరి నాటికి పూర్తవుతుందని సమాచారం. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసిన తర్వాత ఐపీఎల్-2024 సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఐపీఎల్ 17వ సీజన్ కోసం బీసీసీఐ మరో కొత్త నిబంధన తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఓవర్‌కు రెండు బౌన్సర్లు వేసేలా బౌలర్లకు అవకాశం ఇవ్వనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
బంతికి, బ్యాట్‌కు మధ్య పోటీని మరింత పెంచేలా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఇప్పటికే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ రూల్‌ను పరీక్షించారు. ఐపీఎల్ 2024 సీజన్‌లోనూ దీన్ని అమలు చేసేందుకు బీసీసీఐ ఇప్పటికే ఆమోదించినట్లు తెలుస్తోంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే ఐపీఎల్ 17వ సీజన్‌లో ఒక ఓవర్లో బౌలర్లు రెండు బౌన్సర్లు వేసేందుకు అనుమతి ఇస్తారు. బౌలర్లకు అనుకూలంగా ఉండే ఈ రూల్‌తో హిట్టర్ల బాదుడుకు అడ్డుకట్ట వేసినట్లేనని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఐసీసీ వన్డే, టెస్టుల్లో ఓవర్‌కు రెండు బౌన్సర్లను అనుమతిస్తుండగా.. టీ20 ఫార్మాట్‌లో ఒక బౌన్సర్‌కే అనుమతి ఉంది. ఓవర్‌కు రెండు బౌన్సర్లు వేసేలా బౌలర్లకు అవకాశం ఇవ్వనున్నారన్న వార్తలపై టీమ్‌ఇండియా పేసర్ జయదేవ్ ఉనద్కత్ స్పందించాడు. ఓవర్‌కు రెండు బౌన్సర్లు వేసే అవకాశం ఇవ్వడం మంచి నిర్ణయమన్నాడు. ఈ కొత్త నిబంధనతో బౌలర్లకు మరో ఆయుధం ఇచ్చినట్లే అని అభిప్రాయపడ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 72 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అత్యంత ఖరీదైనదిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు స్టార్క్‌ను కొనుగోలు చేసింది. పాట్ కమిన్స్ రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 20.50 కోట్లకు కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా హర్షల్ పటేల్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. యూపీ తరఫున ఆడిన సమీర్ రిజ్వీ అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్. సమీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 8.40 కోట్లకు కొనుగోలు చేసింది.
అయితే ఈ వేలంలో భారీ ధర దక్కించుకుంటారనుకున్న అంచనాలు తప్పాయి. దిగ్గజ ఆటగాళ్లకు ఈసారి జరిగిన మినీ వేలంలో నిరాశే ఎదురైంది. అమ్ముడుపోని టాప్- 10 ఆటగాళ్లను ఓసారి పరిశీలిస్తే. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఐపీఎల్ మినీ వేలంలో అమ్ముడుపోలేదు. స్మిత్‌ను దక్కించుకునేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు. స్మిత్‌తో పాటు జోష్ ఇంగ్లిస్, ఆదిల్ రషీద్, వాండర్ డసెన్, జేమ్స్ విన్స్, సీన్ అబాట్, జేమీ ఓవర్టన్, బెన్ డకెట, ఫిలిప్ సాల్ట్, జోష్ హేజిల్ వుడ్ అమ్ముడు పోలేదు.